టెన్త్ పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ ఎవరి మనిషి?

తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బాగా కావాల్సిన మనిషి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫొటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. దీంతో బీజేపీ నేతలు తొలుత డిఫెన్సులో పడిన ఆ తరువాత బీఆర్ఎస్ నేతలతో సంజయ్ ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రశాంత్ అసలు ఎవరి మనిషి? అనేది సోసల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలతో ప్రశాంత్ ఫొటోలు కనిపిస్తున్నారు. ఈ ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రశాంత్ బండి సంజయ్ మనిషితే ఈ ఫొటోల సంగతేంటి అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రశాంత్ మీడియాలో పనిచేస్తుండడంతో ఆయన అన్ని పార్టీల వారినీ కలిసే అవకాశం ఉందని.. అలా అని.. ఆయన బీజేపీ మనిషి అంటూ బండి సంజయ్‌తో లింక్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

కాగా టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడికి సన్నిహితుడని.. ఇదంతా సంజయ్ కుట్ర ప్రకారమే జరిగిందంటూ తెలంగాణ పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేయడం.. నిరసనలు తెలిసిందే.

సంజయ్ అరెస్ట్ పై బీజేపీ లీగల్ సెల్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. లీకేజ్ పై విచారణ చేయకుండా, అసలైన నిందితులను అరెస్ట్ చేయకుండా, విద్యార్థులకు న్యాయం చేయకుండా బీజేపీని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తానికి ఈ విషయం ముదిరి తెలంగాణలో రాజకీయ వివాదంగా మారిపోయింది.