ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వైసీపీ అరాచకాలతో జనం ఇప్పుడు ఫుల్లుగా టీడీపీ వైపే చేస్తూన్నారు. ఈ సంగతి ఆ పార్టీ నేతలకు బాగానే అర్థమైంది. దానితో వారిలో కొత్త జోష్ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని నిర్ణయానికి వచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు పార్టీ టికెట్ కోసం కర్చీఫ్ వేస్తున్నారు. అలా ప్రతీ నియోజవర్గానికి ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు, మరో ఐదారుగురు ఆశావహులు ఉన్నారు.
టీడీపీకి కొన్ని నియోజకవర్గాలు అత్యంత కీలకం కానున్నాయి. అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ టీడీపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి అది బలమైన నియోజకవర్గమని చెప్పాలి. నాయకుల తీరు ఎలా ఉన్నా, వారు పనిచేసినా పనిచేయకపోయినా నిడదవోలులో టీడీపీ కేడర్ చాలా కమిటెడ్ గా ఉంటుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి చెందినా..కొంత మంది నాయకులు పార్టీకి దూరంగా ఉన్నా.. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ… విపక్షంలోనూ టీడీపీని బలంగా ఉంచేందుకు కేడర్ ప్రయత్నిస్తూనే ఉంది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మరోసారి నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు. 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న శేషారావుకు ఇప్పుడు కూడా నియోజకవర్గ టీడీపీ కేడర్ లో మంచి పేరు ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కేవలం టీడీపీ, జనసేన మధ్య ఓట్ల చీలికతోనేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే ఎప్పుడు శేషారావుకే టికెట్ ఇవ్వాలా… ఈసారి నాకివ్వండి అని కుందుల సత్యనారాయణ అంటున్నారు. దానితో ఇద్దరు నేతలు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..
నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా ఉన్న బూరుగుపల్లి శేషారావు అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో క్రియాశీల భూమిక పోషించారు. అదేసమయంలో కుందుల సత్యనారాయణ సైతం రైతుల పాదయాత్రలో తన అనుచరులు, సహచరులతో పాల్గొని, వారి పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిడదవోలులో పర్యటించినప్పుడు ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగారు. అప్పటి నుంచే అసలు ఆధిపత్యపోరు మొదలైంది. .
చంద్రబాబు పర్యటన సమయంలో కుందుల సత్యనారాయణ తన ప్రాభవం చూపించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. కాకపోతే శేషారావు గ్రూపు.. సత్యనారాయణను స్టేజీ ఎక్కనివ్వకుండా చూసింది. దానితో ఆయనలో పట్టుదల మరింతగా పెరిగింది. పార్టీ టికెట్ కోసం కొందరు పెద్దల ద్వారి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారి ద్వారా హైకమాండ్ లోని అత్యంత కీలక నేతను కలిసి, ఆయన గ్రీన్ సిగ్నల్ పొందినట్లు తెలుగుదేశం వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా అమరావతి , హైదరాబాద్ వెళుతూ పార్టీ పెద్దలను కలుస్తున్నారు.. ఈ పరిస్థితి గమనించిన బూరుగుపల్లి శేషారావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన కూడా పార్టీ పెద్దలను కలవడం మొదలుపెట్టారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.పైగా చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయని శేషారావు నియోజకవర్గంలో అందరికీ చెప్పుకుంటున్నారట. మరి ఫైనల్ గా టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి…