కలకలం సృష్టిస్తున్న రేంజ్ రోవర్

సుఖేష్ చంద్రశేఖర్ ఏ ముహూర్తంలో రు. 15 కోట్ల ముడుపులను తాను బీఆర్ఎస్ ఆఫీసులో అందించానని చెప్పాడో తెలీదు కానీ ఆ విషయం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు 15 కోట్ల రూపాయలను తెచ్చి బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులోని ఏపీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు సుఖేష్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. సుఖేస్ విడుదలచేసిన లేఖ బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది.

అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఈడీ విచారణకు హాజరవుతున్న కల్వకుంట్ల కవిత కారణంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీయార్ ఫ్యామిలీ డిఫెన్సులో పడిపోయింది. కవితను ఇపుడు అరెస్టు చేస్తారు లేదులేదు రేపు అరెస్టు చేస్తారనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సుఖేష్ విడుదల చేసిన లేఖ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్లయ్యింది. ఇపుడు పార్టీలో కానీ ఇతర పార్టీల్లో కానీ రేంజ్ రోవర్ కారు, ఏపీ అనే పేరున్న వ్యక్తులపైనే చర్చ జరుగుతోంది.

ఇదే విషయమై ఈడీ కూడా విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో రేంజి రోవర్ కారు వాడేంత స్ధాయి ఉన్న నేతలు ఎవరు ? అనేది మొదటి ప్రశ్న. సుఖేష్ లేఖలో చెప్పినట్లుగా 6060 అనే నెంబర్  రేంజ్ రోవర్ కారును ఎవరు వాడుతున్నారు ? అన్నది రెండో ప్రశ్న. ఇక రేంజ్ రోవర్ కారులో కూర్చున్న ఏపీ అనే పేరున్న వ్యక్తి ఎవరు ? ఆ వ్యక్తికి పార్టీతో సంబంధమా ? లేకపోతే పార్టీ ఆఫీసు కాంపౌండ్ ను సేఫ్టీ కోసమే వాడుకున్నారా ? అనే విషయాలపై ఈడీ కూడా ఆరా తీస్తోందట.

ఒక సమాచారం ప్రకారం ఏపీ అంటే అరుణ్ రామచంద్రపిళ్ళై అని తెలుస్తోంది. పిళ్ళై ఇప్పటికే స్కామ్ లో ఇరుక్కుని కస్టడీలో ఉంటు  ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కవితకు తాను బినామీని మాత్రమే అని ఇదే పిళ్ళై ఒకపుడు చెప్పి మళ్ళీ తన స్టేట్మెంట్ ను ఉపసంహరించుకున్నారు. అందుకనే సుఖేష్ ద్వారా వచ్చిన డబ్బును పిళ్ళై తీసుకుని కవితకు అందించారనే ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి రేంజ్ రోవర్ కారు ఎవరిదనే విషయం ఈడీకి ఈపాటికే తెలిసిపోయుంటుందనటంలో సందేహంలేదు.