మేక‌పాటి వ‌ర్సెస్ మేక‌పాటి.. వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు మ‌రింతగా కాగుతున్నాయి. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోయిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. వైసీపీపై గ‌త వారం రోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ వైఖ‌రిపైనా.. ప్ర‌భుత్వం తీరుపైనా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద‌య‌గిరిలో తాను నాలుగుసార్లుగా విజ‌యం ద‌క్కించుకుంటున్నాన‌ని..ఇ ప్పుడు జ‌గ‌న్ త‌న‌ను అవ‌మానించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాదు.. ఉద‌య‌గిరిలో అడుగు పెట్ట‌లేరంటూ.. వైసీపీ నేత‌లు చేసిన సవాళ్ల‌పైనా ఆయ‌న రియాక్ట్ అయ్యారు.

నేరుగా ఉద‌య‌గిరి బ‌స్టాండ్ సెంట‌ర్‌కు వ‌చ్చిన ఆయ‌న మ‌ధ్య‌లో కుర్చీ వేసుకుని కూర్చుని హ‌ల్చ‌ల్ చేశారు. అయితే.. ఆయ‌న అర‌గంట‌సేపు అక్క‌డ కూర్చున్నా.. వైసీపీ నేత‌లు ఎవ‌రూ రాలేదు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. చ్చే ఎన్నికల్లో తనకు జగన్ సీటు ఇవ్వనని చెప్పారని పలు ఇంటర్వ్యూల్లో చంద్రశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కొత్త వారు సీటు తమదేనని చెబుతున్నారని.. వారంతా నేతలు కాలేరంటూ వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను జగన్ వెన్నుపోటు పొడిచారని కామెంట్ చేసారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ దెబ్బ తింటుందన్నారు.

అయితే.. మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డివ్యాఖ్య‌ల‌పై ఆయ‌న అన్న, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు, ప్ర‌స్తుతం ఆత్మ‌కూరు ఎమ్మెల్యేగా ఉన్న మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మేక‌పాటి అనే ఇంటి పేరు, వైసీపీ అనే పార్టీ పేరు లేకుండా.. బ‌య‌ట‌కు వ‌స్తే.. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ప‌రిస్థితి, ఆయ‌న శ‌క్తి, బ‌లం వంటివి తెలుస్తాయ‌ని నిప్పులు చెరిగారు. ఈ సారి చంద్రశేఖర రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. పార్టీ లైన్‌ దాటితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవన్నారు.

అయితే.. మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిపై.. ఆయ‌న అన్న‌కుమారుడినే వైసీపీ అధిష్టానం ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌యోగించింద‌నే టాక్ వినిపిస్తోంది. వారు వారు కొట్టుకుంటే.. స‌రిపోతుంద‌ని.. మ‌ధ్య‌లో మ‌న జోక్యం ఎందుక‌నే ధోర‌ణిలో వైసీపీ వ్య‌వ‌హ‌రించింద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అంతేకాదు.. మేక‌పాటి కుటుంబ విష‌యంలో తాము జోక్యం చేసుకునే క‌న్నా.. వారే తేల్చుకుంటే అది త‌మ‌కు మేలు చేస్తుంద‌ని భావించి ఉండొచ్చ‌ని.. అందుకే విక్ర‌మ్‌రెడ్డిని రంగంలోకి దింపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ ఏ మేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.