కాంగ్రెస్‌.. ఏపీ ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందే..

జాతీయ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఇప్పుడు ఏపీ గుర్తుకు వ‌చ్చింది. ఏపీ అనే రాష్ట్రం ఒక‌టి ఉంద‌ని.. ఇక్క‌డ కొన్ని రాజ‌కీయ పార్టీలు ఉన్నాయ‌ని.. వాటికి కూడా స్పందించే గుణం ఉంద‌ని.. పాపం.. కాంగ్రెస్‌కు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చింది. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. రాహుల్ గాంధీ ఇరుకున ప‌డి…పార్ల‌మెంటు స‌భ్య త్వం కోల్పోయి.. కోర్టు నుంచి జైలు శిక్ష ప‌డి.. ఉన్న‌ ఇంటిని కూడా ఖాళీ చేయాల‌నే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ ప‌రిణామాల‌తో ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్న కాంగ్రెస్‌కు అండ‌గా ఉండే నేత‌లు క‌నిపించ‌డం లేదు. మోడీ దూకుడుతో అత‌లాకుత‌లం అవుతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు హ‌ఠాత్తుగా.. ఏపీ గుర్తుకు వ‌చ్చింది. ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయ‌ని.. ఆపార్టీల‌న్నీ.. రాహుల్‌కు అండ‌గా నిల‌వాల‌ని.. క‌నీసం.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ నేత‌లు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ ఆత్మ‌గా పేర్కొనే కేవీపీ.. తాజాగా క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు.

టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు.. ఏపీలో బ‌లంగా ఉన్నాయ‌ని.. ఇప్పుడు రాహుల్ విష‌యానికి వ‌చ్చేస‌రికి క‌నీసం స్పందించ‌డం లేద‌ని, ఇది త‌గునా? అంటూ.. కేవీపీ ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాహుల్ విష‌యా న్ని ఖండించాల‌ని కూడా కోరారు. అంతేకాదు.. రేపు మీకు ఏమైనా అయితే.. ఎవ‌రూ మీకు అండ‌గా ఉండ రంటూ శాప‌నార్థాలు కూడా పెట్టేశారు. అయితే.. ఇక్క‌డే కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింది.

ఇప్పుడు ఏ పార్టీ లైతే.. త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరుకుంటున్న‌దో.. మ‌రి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఈ పార్టీల‌కు విలువ ఇచ్చింది. క‌నీసం.. డిమాండ్లు విన్న‌దా.. రాష్ట్రాన్ని విడ‌దీయ‌కండ‌ని కోరినా.. ప‌ట్టించు కుందా? పోనీ.. విడ‌దీసినా.. ప్ర‌త్యేక హోదాను విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చాల‌న్న‌.. టీడీపీ వైసీపీల డిమాండ్‌ను ప‌ట్టించుకున్న‌దా? అంటే..లేదు. మ‌రి అడ్డ‌గోలుగా ఆ నాడు వ్య‌వ‌హ‌రించి.. నేడు క‌ష్టంలో ఉన్నాను చేయి అందించండి.. అనే అర్హ‌త అస‌లు కాంగ్రెస్‌కు ఉన్న‌దా? అనేది ప్ర‌శ్న‌.