తనకు ప్రజాబలం ఉందని.. దీనినే తాను నమ్ముకున్నానని.. పదే పదే చెబుతున్న సీఎం జగన్.. లౌక్యాన్ని విస్మరించారు. తను చెప్పిందే వేదం.. తాను గీసిందే లక్ష్మణ రేఖ అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోతోందనే వాదన వినిపిస్తోంది. నిజానికి జగన్ పార్టీ వైసీపీ ఏమీ.. తీసేయాల్సింది కాదు. పుల్లపుల్ల పేర్చి పెట్టుకున్న పిచ్చుక గూడు మాదిరిగా.. అనేక కష్టనష్టాలకు.. కేసులకు ఓర్చుకుని.. కట్టుకున్న పొదరిల్లు లాంటి పార్టీ వైసీపీ.
ఆదిలో అంటే.. పార్టీ ప్రారంభంలో .. అసలు ఎలాంటి అంచనాలూ లేవు. పట్టుమని 100 మంది నాయకులు కూడాలేరు. అయినా.. మొక్కవోని దీక్షతో జగన్ పార్టీని ముందుకు నడిపించారు. తర్వాత తర్వాత.. నాయకులు వచ్చి చేరారు. పాదయాత్రతో ఇది ప్రభంజనంగా మారింది. అయితే.. పార్టీ తనదే అయినా.. నాయకులు లేకుండా పార్టీ నడుస్తుందా? అనే చిన్న సూత్రాన్ని మాత్రం జగన్ విస్మరించారనేది వాస్తవం. అదే ఇప్పుడు పార్టీకి మైనస్‌గా మారిపోయింది.
పార్టీలో తల్లి, చెల్లిల పాత్రలను పూర్తిగా పక్కన పెట్టడం ద్వారా.. నాయకుల్లో ఆత్మస్థయిర్యాన్ని జగన్ కోల్పోయేలా చేశారనేది కూడా వాస్తవం. ఎందుకంటే.. చాలా మంది నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. పార్టీకి ఎంత చేసినా.. చివరి నిముషంలో తమ పరిస్తితి కూడా అంతేనా? అనే ప్రశ్నలు కూడా ఉదయించాయి. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మారింది నలుగురే కావొచ్చు. కానీ, అదే టీడీపీ మరో ఇద్దరు అభ్యర్థులను పోటీకి పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో!! అనే చర్చ జోరుగా జరుగుతోంది.
రాజకీయంగా ప్రజలు అవసరమే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, అదే సమయంలో పార్టీ జెండా పట్టుకునేవారు..అ జెండాను ముందుకు తీసుకువెళ్లేవారు కూడా పార్టీకి అవసరం. ఈ విషయాన్ని జగన్.. విస్మరించి.. స్కూల్ పిల్లల వ్యవహారం మాదిరిగా పార్టీని నడిపించారు. తాను చెప్పిందే వినాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఏముంది.. స్కూలు పిల్లల్లాగా.. ఉంది మా పరిస్థితి. అక్కడైనా అంతో ఇంతో స్వేచ్ఛ ఉంటుంది. మాకు అదీ లేదు
అని కొన్నాళ్ల కిందట నిర్వహించిన సమావేశంపై ఓ ఎమ్మెల్యే బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
అడుగడుగునా నిఘా.. అసంతృప్తి.. హెచ్చరికలు.. పార్టీ నేతలకు అందుబాటులో లేక పోవడం.. వంటివి జగన్‌కు నేతలకు మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. దీనికితోడు.. లౌక్యం లేకపోవడం మరింతగా పార్టీని భ్రష్టు పట్టించిందనడంలో సందేహం లేదు. ఎవరికైనా టికెట్ ఇచ్చేదీ ఇవ్వందీ.. ఎన్నికలకు ముందు చెబుతారు.. లేదా..వారి పెర్ఫార్మెన్స్.. ను కూడా అప్పుడే అంచనా వేస్తారు. కానీ, జగన్ మాత్రం ఏడాది రెండేళ్ల ముందుగానే .. ఎమ్మెల్యేలకు చేసిన హెచ్చరికలు లౌక్యం లేకుండా చేసిన వాదనలు పార్టీకి శాపంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రేపు పార్టీలో మిగిలేది.. సలహాదారులేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.