ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చేసే ప్రయత్నాలు.. ఎన్నాళ్లో సాగవు. నిజాలు తెలిసిన తర్వాత.. ఏ ప్రజలు ఆగరు! ఇదీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజా నాడికి అద్దం పట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పును పరిశీలిస్తే అర్ధం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా.. సింగిల్‌గా ఎదుర్కొని విజయం దక్కించుకుంటామని వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు.
అయితే.. ఆ ఎన్నికలు మరో రూపంలో వచ్చాయి. అవే గ్రాడ్యుయేట్ ఎన్నికలు. స్థానిక సంస్థల కోటా.. ఉపాధ్యాయ వర్గాల కోటా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు, ఆ పార్టీ మద్దతు దారులు విజయం దక్కించుకున్నా.. ఆ రెండు ఎన్నికలు కూడా.. ఆయా వర్గాలకు మాత్రమే పరిమితం. విస్తృతమైన ప్రజాభిప్రాయానికి మాత్రం కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికలు మాత్రమే అద్దం పట్టాయి. ఎందుకంటే.. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరూ ఓటు వేశారు.
అంటే.. వీరంతా పట్టభద్రులు.. చదువుకున్నవారు. వీరు వేసే ఓటు.. ఒకింత వివేచన.. ఆలోచనతోనే ఉంటుందనేది పరిశీలకుల మాట. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? ఏ పార్టీ ప్రజలకు అండగా ఉంది..? అభివృద్ధి మాటేంటి? వంటి అనేక విషయాల్లో గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు. పథకాలు.. సంక్షేమంతోనే పొద్దు పుచ్చుతున్న వైసీపీ.. ఎక్కడా గంపెడు మట్టి పోయలేదు.. పట్టుమని.. ఓపరిశ్రమను స్థాపించలేదు.
ఇది గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆలోచనకు గురి చేసింది. అప్పులు చేయడం.. వాటిని ప్రజలకు (లబ్ధిదారుల కు) పంచడం.. ఆ అప్పులు భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలందరిపైనా మోపడం వంటివే పాలన అని భావిస్తున్నట్టుగా వైసీపీ నేతలపై ఒకింత చదువుకున్న వారు ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఉత్తరాంధ్ర తీర్పు.. మేలిమి అని చెప్పవచ్చని అంటున్నారు పరిశీలకులు.
ప్రజలకు కావాల్సింది. కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం కాదు. ఆ డబ్బులు ఎలా సంపాయించాలనే తెలివి తేటలు.. లేదా మార్గాలను కల్పించడం. ఈ రెండు కూడా వైసీపీ సర్కారులో లోపించాయనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. అయిన్పటికీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అప్పులు చేస్తూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్లు.. తమదైన శైలిలో తీర్పు ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.