డిల్లీలో ఏమి జరుగుతోంది ?

లిక్కర్ స్కాం లో ఢిల్లీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో గురువారం కల్వకుంట్ల కవితను ఈడీ రెండో విడత విచారణ చేయబోతోంది. మొన్న 11వ తేదీన మొదటిసారి జరిగిన విచారణ దాదాపు తొమ్మిది గంటలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసుకు చేరుకుంటారని సమాచారం.

విచారణ మొదలయ్యే సమయానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత విచారణ అంటేనే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఢిల్లీకి వెళుతున్నదారు ? ఢిల్లీలో ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే కవిత విచారణ సందర్భంగా ఇంతమంది ఇలా స్పందిస్తున్నారని అనుకోవాలి.

అసలు మొన్నటి 11వ తేదీనే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన హడావుడి ఆ విధంగా కనిపించింది. అందుకనే 10వ తేదీ హైదరాబాద్ లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీయార్ మాట్లాడుతూ కవితను ఈడీ అరెస్టు చేయవచ్చని ప్రకటించారు. దాంతో విచారణ విషయంలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఆ రోజు అరెస్టు జరగలేదు. విచారణ ముగియగానే రాత్రికి రాత్రే కేటీయార్, హరీష్ తో కలిసి కవిత హైదరాబాద్ కు వచ్చేశారు.

అలాంటిది ఇపుడు మళ్ళీ కేటీయార్, హరీష్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు ? చూడబోతే యావత్ బీఆర్ఎస్ మొత్తం ఈడీపై మైండ్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. కవిత ఒంటరి కాదని మొత్తం బీఆర్ఎస్ అంతా తనకు మద్దతుగా ఉందని సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో దర్యాప్తసంస్ధలు మంత్రులు, ఎంపీలను విచారణ చేసినపుడు పార్టీ ఇలాంటి సంకేతాలు పంపలేదు. కవిత విషయంలో మాత్రం ఇలాంటి సంకేతాలు పంపుతోందని అర్ధమవుతోంది. మరి ఈడీ విచారణ సందర్భంగా ఏమిచేస్తుందో చూడాల్సిందే.