అవినాష్ ఐదోసారి – కష్టమేనా…

వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.

గురువారం మళ్లీ..

అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు నోటీసులు అందాయి. గురువారం హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. హాజరు నుంచి మినహాయింపు విషయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఆయన విధిగా హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దానితో గురువారం సీబీఐ తీరు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

వరుసగా మూడు సార్లు అవినాష్ మీడియాతో మాట్లాడటంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. దానితో ఇప్పుడు ఏం జరిగిన ఆయన మౌనం వహించాల్సిందే.. పైగా సీబీఐ అధికారులపై అవినాష్ చాలా ఆరోపణలు కూడా చేశారు. మరో పక్క ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తారో ఇంకా తెలియరాలేదు. భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులే రాలేదు.