ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న టీడీపీ నేతలు.. ఒకే బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు అసలు పార్టీతో టచ్‌లోకూడా లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం.. జెండా పట్టారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు హమ్మయ్య! అని ఊపరి పీల్చుకున్నారు. మరి ఈ పరిణామం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అంటే.. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఉన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు ప్రధానమని భావిస్తోంది.మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పట్టభద్ర స్థానంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే..నేతల మధ్య సఖ్యత కొరవడడంతో చంద్రబాబు నిన్న మొన్నటి వరకు దీనిని పక్కన పెట్టేశారు. కానీ, ఇప్పుడు నేతలు కలుసుకున్నారు. చేతులు కలుపుకొన్నారు.
టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తరనియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు.. అందరూ కలిసి.. చిరంజీవిరావును గెలిపించాలని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని… పట్టభద్రుల ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. మూడు జిల్లాల్లో ఎంతో మంది పట్టభధ్రులు ఉన్నారో.. అందరూ కలిసి ఓటు వేయాలని కోరారు. పట్టభద్రుల మౌనం మంచిది కాదని తెలిపారు. ఉద్యోగులు నిరుద్యోగులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి చెంప పెట్టు విధంగా ఈ ఎన్నికలు జరగాలని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామంతో చంద్రబాబు ఖుషీ అయ్యారనే చెప్పాలి.