లోకేష్ ఇన్నన్నా.. కిక్కురుమ‌న‌లేదే..!!

రాజ‌కీయాల్లో నేత‌లు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఒకరి పై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం కామ‌నే. పైగా వైసీపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య ఈ వివాదాలు.. కౌంట‌ర్లు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నాయి. ఇక‌, తాజాగా టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చిత్తూరు జిల్లాలో న‌డుస్తున్నారు. అయితే.. ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డి ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే దుమ్ము దులిపేస్తున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

అయితే.. రాజ‌కీయంగా నాయ‌కుల‌పైనా.. మంత్రుల‌పైనా నారా లోకేష్ ఇంతస్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నా కూడా వైసీపీ నుంచి ఎలాంటి కౌంట‌ర్లు ప‌డ‌డం లేదు. నిజానికి చిత్తూరు జిల్లా వైసీపీ నాయ‌కులు ఫైర్‌బ్రాండ్ల‌కు పెట్టింది పేరు. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి , రోజా.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి వారు.. దూకుడుగానే కామెంట్లు చేస్తారు. కానీ, ఇప్పుడు నారా లోకేష్ విష‌యంలో వారంతా సైలెంట్ అయిపోయారు. దీనికి కార‌ణం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కుమారుడు అభిన‌వ్ రెడ్డిపై నారా లోకేష్ విరుచుకుప‌డ్డారు.

అభిన‌వ్ రెడ్డి షాడో ఎమ్మెల్యే అని.. లిక్క‌ర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నార‌ని.. టీటీడీ శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్ల‌ను కూడా అమ్ముకుంటున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో తండ్రి భూమ‌న‌క‌రుణాక‌ర్ రెడ్డి స‌మాజంలో పెద్ద నేత‌గా చ‌లామ‌ణి అవుతూ.. త‌న కొడుకుతో చిల్ల‌ర ప‌నులు చేయిస్తున్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ.. భూమన కుటుంబం నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాలేదు. మ‌రోవైపు..పీలేరులోనూ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ మొత్తం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నారా లోకేష్‌ను వైసీపీ ప‌ట్టించుకోవ‌డం లేదా.. లేక‌.. ఆయ‌న‌ను ప‌ట్టించుకుని కౌంట‌ర్లు ఇస్తే.. లోకేష్ పాద‌యాత్ర‌కు మ‌రింత బూమ్ ఇచ్చిన‌ట్టు అవుతుందని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎలా చూసుకున్నా.. నారా లోకేష్ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా బాగానే వైర‌ల్ అవుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మౌనంగా ఉండ‌డంపై ఆ పార్టీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇవి నిజ‌మేనా? లేక వ్యూహాత్మ‌కంగా మౌనంగా ఉంటున్నారా? అనేది తేలాల్సి ఉంది.