ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను పక్కన పెడితే.. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వైసీపీకి ప్రాణసంకటంగా మారాయి. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికల్లో ఆయా వర్గాలు.. అంటే టీచర్లు, పట్టభద్రులు మాత్రమే ప్రచారం చేస్తారు.
పోటీలోనూ వారే ఉంటారు. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా జోక్యం చేసుకున్నాయి. ఎవరికి వారు.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి వర్గాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రచారానికి దిగి వస్తున్నారు. దీంతో టీడీపీ కూడా అదే వ్యూహం పాటిస్తోంది.
ఎక్కడా తగ్గేదేలా! అన్నట్టుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో నూ.. రాయలసీమలోనూ గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా.. వైసీపీ వ్యతిరేకతను వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేందుకు ప్రయత్ని స్తున్నారు.
ఇక, వైసీపీ నాయకులు కూడా జగన్ ఆమోదం ఉందని నిరూపించే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. కీలక మైన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఇలా ఏ విధంగా చూసినా.. రెండు పార్టీలూ.. ప్రచార జోరును పెంచాయి. దీంతోఎమ్మెల్సీ ఎన్నికలు.. జగన్ ఫ్యూచర్‌ను తేల్చేస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి ఇది నిజమేనా? ఏం జరుగుతుంది? అంటే.. ఈ నెల 23వరకు వెయిట్ చేయాల్సిందే.