ఎంతో అట్టహాసంగా విశాఖపట్నంలో ప్రారంభమైన రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గేమ్ ఛేంజర్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి రు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకనే ప్రపంచంలోనే కాకుండా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ సదస్సుకు ఆహ్వానించింది ప్రభుత్వం. నిజంగానే అంచనా వేసినట్లు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందిస్తే అంతకన్నా రాష్ట్రానికి కావాల్సింది ఏముంటుంది ?
ఆపిల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వం ఆహ్వానించింది. అలాగే ముఖేష్ అంబానీ, అదాని, జీఎంఆర్, బిర్లా, టాటా లాంటి కంపెనీల అధినేతలను కూడా ఆహ్వానించింది. వీరిలో అంబానీ, జీఎంఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తదితరులు సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచప్రఖ్యాత కంపెనీల తరపున ఎవరు హాజరయ్యింది ఇంకా తెలీదు. మొత్తంమీద ప్రభుత్వం అంచనా వేస్తున్న రు. 2 లక్షల కోట్లలో కనీసం సగం అంటే లక్ష కోట్లరూపాయలు పెట్టబుడుల రూపంలో వచ్చినా చాలు.
జగన్ అధికారంలోకి వచ్చి సుమారు 4 ఏళ్ళవుతోంది. ఇందులో దాదాపు ఏడాదిన్నర కాలం కరోనా సమస్యతోనే సరిపోయింది. మిగిలిన రెండున్నరేళ్ళల్లో వ్యక్తిగత హోదాలో ఆసక్తి చూపించి కొందరు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు. కొన్ని యూనిట్లు మొదలయ్యాయి మరికొన్ని పరిశ్రమలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. అచ్చంగా పెట్టుబడుల ఆకర్షణకే సదస్సు నిర్వహించటం నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి. ఇక వచ్చే ఏడాది ఇంత అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడపతో పాటు ప్రకాశం జిల్లాలు అభివృద్ధిలో వెనకబడ్డాయి.
కాబట్టి ఈ సదస్సులోనే వీలైనంతగా ఎంవోయులు కుదుర్చుకుని పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. కేవలం ఎంవోయులకే పరిమితం కాకుండా పరిశ్రమలు, యూనిట్లు ప్రారంభం అయితేనే సదస్సు సక్సెస్ అయినట్లు లెక్క. లేకపోతే సదస్సు నిర్వహణకు చేసిన ఖర్చంతా వృధాయే అనుకోవాలి. ఈ విషయంలోనే జగన్ అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. సదస్సులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న 16 వేలమంది పారిశ్రామికవేత్తల్లో పదోశాతం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైన చాలు. మొదటిరోజు దిగ్గజ పారిశ్రామికవేత్తలు 25 మంది ప్రసంగించబోతున్నారు. వీరిలో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. సదస్సు సక్సెస్ అయ్యింది లేంది తేలాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates