10 ఎమ్మెల్యే-2 ఎంపీ స్థానాల్లో.. జ‌న‌సేన దూకుడు!

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు త‌మ త‌మ గ్రాఫ్‌ను స‌రిచూసుకుంటున్నారు. మ‌రి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రాఫ్ ఎలా ఉంది? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏయే జిల్లాల్లో ఎంత మేర‌కు స‌త్తా నిరూపించుకోనున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యాల‌పైనే కొంద‌రు చేసిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. ప‌వ‌న్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాల్సిందేన‌ని.. ఈ స‌ర్వే తేల్చ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు..అస‌లు నాయ‌కులే లేని పార్టీ అంటూ.. ఎక్కువ‌గా ప్ర‌జ‌లు పేర్కొన్నారు. మ‌రీ ముఖ్యంగా.. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతే.. త‌మ క‌ష్టాలు ఎవ‌రికి చెప్పుకోవాలి? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. స‌రే.. ఇవ‌న్నీ కామన్‌గా ఎప్పుడూ ఉన్న‌వే. ప‌వ‌న్ అంతే! ఎప్పుడో ఆయ‌న‌కు కాల్ షీట్ వీలున్న‌ప్పుడు వ‌స్తున్నారు. అయితే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. రెండు పార్ల‌మెంటు స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని తేల‌డం గ‌మ‌నార్హం.

ఒక‌టి అన‌కాప‌ల్లి… రెండు కాకినాడ‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. మెజారిటీ ప్ర‌జ‌లు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్‌కు సై అంటున్నారు. ఒక‌టి విశాఖ‌లో ఉండ‌గా.. రెండోది ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిజిల్లాలో ఉంది. రెండు చోట్ల కూడా కాపుల డామినేష‌న్ క‌నిపిస్తోంది. ఇక‌, ఈ సారి న‌ర‌సాపురంలో జ‌న‌సేన పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని తేలింది. అదేవిధంగా విజ‌యవాడ ప‌శ్చిమ‌, గుంటూరు వెస్ట్‌, స‌త్తెన‌ప‌ల్లి, క‌ర్నూలు, పాణ్యం వంటి నియోక‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన దూకుడుగానే ఉంద‌ని తెలిసింది.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌భావం కూడా బాగానే ఉన్నా.. సీట్ల సంఖ్య‌పై మాత్రం క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం జ‌రిగిన స‌ర్వే అంతా కూడా.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం అయింది. గ్రామీణ స్థాయిలో ఎలా ఉంద‌నేది తేలాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో మాత్రం జ‌న‌సేన దూకుడుగా ఉన్న‌ట్టు తేలింది. ప‌వ‌న్ క‌నుక పుంజుకుంటే.. ఈ గ్రాఫ్ పెరుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.