బాల‌య్య చిన్న‌ల్లుడికి టార్గెట్ పెట్టిన చంద్ర‌బాబు…!

టీడీపీ యువ‌నాయ‌కుడు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు ఇంచార్జ్‌గా ఉన్న శ్రీ భ‌ర‌త్‌కు ఇప్పుడు కీల‌క టార్గెట్ అప్ప‌గించార‌ట‌.. పార్టీ అధినేత చంద్ర‌బాబు. ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ ద‌క్కించుకునేలా వ్య‌వ‌హ‌రించాల‌ని.. దీనికి టార్గెట్‌గా పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు పునాదులు వేసుకోవాల‌ని కూడా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి టీడీపీ మ‌ద్ద‌తుదారుగా డాక్ట‌ర్ వేపాడ చిరంజీవి రావు పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌ను గెలిపించి.. పార్టీకి గిఫ్టుగా ఇవ్వాల‌ని చంద్ర‌బాబు శ్రీభ‌ర‌త్‌ను కోరిన‌ట్టు పార్టీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు పెట్టిన టార్గెట్ ను శ్రీభ‌ర‌త్ చాలెంజ్‌గా తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వ‌స్తే.. రాష్ట్రంలో ఎక్క‌డాలేని పోటీ ఇక్క‌డే ఉంది.

దాదాపు 40 మంది ప‌ట్ట‌భ‌ద్రులు పోటీలో ఉన్నారు. వీరిలో కీల‌క‌మైన బీజేపీ ప్ర‌స్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్‌, అదేస‌మ‌యంలో వైసీపీ అభ్య‌ర్థి సీతంరాజు సుధాక‌ర్ బ‌లంగా పోరాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీని గెలిపించే బాధ్య‌తను శ్రీభ‌ర‌త్‌పై పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను క‌దిలించే ప్ర‌య‌త్నం అయితే సాగింది. గండి బాబ్జీ.. స‌హా అనేక మంది నాయ‌కుల‌ను క‌లుపుకొని పోవాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటేనే యువ‌త‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం.. యువ‌త‌కు చేస్తున్న మోసాలు.. నిరుద్యోగం.. ఉద్యోగ క్యాలెండ‌ర్ ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌క‌పోవ డం వంటి అనేక విష‌యాల‌ను ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో శ్రీభ‌ర‌త్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి పుంజుకోవ‌డం తేలిక అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.