ఏపీ సీఎం జగన్ కు ఇసుక పైనే రోజుకు రూ. 3 కోట్ల ఆదాయం లభిస్తోందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇసుక విధానాన్ని భ్రష్టు పట్టించి.. తన ఖజానా నింపుకునేందుకు జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎత్తుగడలు వేశారని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్.. తాజాగా తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
ఈ సమయంలో భవన నిర్మాణ కార్మికులు తమ బాధలను నారా లోకేష్‌కు చెప్పుకొన్నారు. జగన్ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడుతోంది భవన నిర్మాణ కార్మికులేనని లోకేష్ ఆరోపించారు. అద్భుతమైన ఇసుక విధానం తీసుకువస్తానని అన్న జగన్.. భవన నిర్మాణ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు.
కార్మికుల ఆరోగ్య బీమాను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో బంగారమైనా దొరుకుతుందేమో కానీ.. ఇసుక మాత్రం దొరకదని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు.
ఇసుకు అక్రమ రవాణా ద్వారా రోజుకు 3కోట్ల రూపాయలు జగన్ రెడ్డి సంపాదిస్తున్నాడని.. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుకకు వెయ్యి రూపాయలు ఉంటే.. నేడు జగన్ పాలనలో 5 వేలకు చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిమెంట్ ధరలు జగన్ పాలనలో 60 శాతం పెరిగాయని దుయ్యబట్టారు. సంక్షేమ బోర్డు ద్వారా సేకరించిన సెస్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిదని అన్నారు. కార్మికుల సమస్యల గురించి ఒక్క రోజైనా మంత్రి జయరాం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates