వైసీపీ స్పీడును తట్టుకోలేకపోతున్న టీడీపీ

ఏపీలో 2022వ సంవ‌త్స‌రం మొద‌ట్లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ అనేక చోట్ల ఏక గ్రీవాలు సాధించింది. అయితే.. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఉద్దేశ పూర్వ‌కంగా ఇత‌ర పార్టీల‌ను తొక్కిపెట్టి.. అభ్య‌ర్థుల‌ను బెదిరించి..నామినేష‌న్లు కూడా వేయ‌నీయ‌కుండానే.. వైసీపీ ఇలా చేసింద‌నే వాద‌న వినిపించింది. దీనిపై టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా అప్ప‌ట్లో గుప్పించారు.

ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ.. ఇవే ‘ఏక‌గ్రీవాల‌’ దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తుండ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోందని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నేత‌లు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం.. ఆయా ఎమ్మెల్సీస్థానాల్లో వైసీపీ ఏక‌గ్రీవాల‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా అంటున్నారు. అయితే.. ఇవి నిజంగానే ఏక‌గ్రీవాలైతే ఫ‌ర్వాలేదు. కానీ, ఉద్దేశపూర్వ‌కంగా బ‌ల‌వంతంగా ఏక‌గ్రీవాలు అయితేనే ఇబ్బందిగా మార‌డం ఖాయం.

ఏం జ‌రుగుతుందోంటే!

ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 5 స్థానాల్లో వైసీపీ ఏక‌గ్రీవాల‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు. క‌డ‌ప‌, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, క‌డ‌ప జిల్లాలో టీడీపీ నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని అధికారులు పేర్కొన్న‌ట్టు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. త‌మ అభ్య‌ర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారని చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారని, కానీ, దీనిలోనూ అనుమానాలు ఉన్నాయ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

టీడీపీకి బ‌ల‌మైన జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించార‌ని టీడీపీ నేత‌లు పేర్కొంటున్నారు. ఆయ‌న‌కు టీడీపీ మ‌ద్ద‌తిస్తోంది. నిజానికి స్థానిక సంస్థ‌ల్లో వైసీపీకే బ‌లం ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ కూడా పోటీ ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నెల్లూరు జిల్లాలో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్‌ చెంగమ్మ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక్క‌డ కూడా వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

కీల‌క‌మైన‌ తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయ ణరావు ఎన్నిక కూడా ఏక‌గ్రీవంగానే సాగ‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించడంపై టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పరిశీలన పూర్తయ్యింది. వైసీపీ తరఫున నర్తు రామారావు, ఇండిపెండెంట్‌గా ఆనెపు రామకృష్ణ బరిలో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు రెండింటిలో మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఏదో ఒక ర‌కంగా.. సొంతం చేసుకోవాల‌నే వ్యూహంతో ఉంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కానీ, దీనిపై పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి సారించ‌లేద‌ని.. మ‌రికొంద‌రునేత‌లు చెబుతున్నారు.