రెండు రోజుల నుంచి సాక్షి మీడియా సంబరం మామూలుగా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాంచి జోష్‌లో ఉన్నారు. ‘ఈనాడు’ పత్రిక చేసిన ఒక తప్పిదం వారికి మంచి అవకాశంగా మారింది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని పరిశీలించేందుకు వచ్చిన ఆ పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేయగా.. విచారణలో భాగంగా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన ఆయన బయట మీడియా వాళ్లకు తన చేతుల మీద దెబ్బల్ని చూపించారు. ఐతే తర్వాతి రోజు ‘ఈనాడు’లో ఆయన చేతులతో పాటు కాళ్ల మీద కూడా దెబ్బలు ఉన్నట్లు ఫొటోలు ప్రచురించారు. కానీ కాళ్ల మీద దెబ్బలున్నట్లుగా ఉన్న ఫొటోలు ఇప్పటివి కావు. రెండేళ్ల ముందు వైసీపీ వాళ్లు తనను కొట్టినట్లుగా చెప్పినప్పటి ఫొటోలవి.
రెండేళ్ల ముందు నాటి ఫొటోలు ప్రచురించి.. జగన్ ప్రభుత్వం, పోటీసుల మీద ‘ఈనాడు’ దుష్ప్రచారం చేస్తోందని మరుసటి రోజు ‘ఈనాడు కొట్టు కథ’ శీర్షికతో సాక్షిలో పెద్ద బేనర్ స్టోరీ వేశారు. ఈనాడు దొరికింది కదా అని అందులో తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలతో దుమ్మెత్తిపోశారు. మరుసటి రోజు జగన్ ప్రభుత్వం ద్వారా పదవులు, ప్రయోజనాలు పొందుతున్న సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్ ‘ఈనాడు’ను టార్గెట్ చేస్తూ బైట్స్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు కూడా ఈ విషయం పట్టుకుని ‘ఈనాడు’ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఐతే ‘ఈనాడు’ చేసింది తప్పే అయినా.. రెండేళ్ల ముందు పట్టాభిని వైసీపీ వాళ్లు కొట్టిన ఫొటోలే వేశారన్న విషయం గమనార్హం.
నిజానికి అంతర్గత సమాచారం ప్రకారం ఈనాడు ఉద్దేశపూర్వకంగా ఏమీ ఈ ఫొటోలు వేయలేదు. స్థానిక కంట్రిబ్యూటర్ పొరపాటుగా ఒకే ఫోల్డర్లో ఉన్న పాత, కొత్త ఫొటోలు కలిపి పంపేశాడు. డెస్కు వాళ్లు గుర్తించలేకపోయారు. ఇందుకు బాధ్యులైన వారిని ఆ రోజే విధుల నుంచి పక్కన పెట్టేశారు. జరిగిన తప్పు విషయమై ఈనాడు, ఈటీవీల్లో క్షమాపణ చెబుతూ సవరణ కూడా ఇచ్చారు. కానీ సాక్షి మీడియా మాత్రం ఈ విషయం మీద పెద్ద రచ్చే చేస్తోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితులుగా పేర్కొంటూ సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ సమర్పిస్తే.. దాని గురించి సాక్షి మీడియాలో ఎక్కడా వార్త లేకపోవడం గమనార్హం.
నాలుగేళ్ల కిందట వివేకా హత్యకు గురైనపుడు ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వార్త ఇచ్చింది.. ఆ తర్వాత అది హత్య అని బయటపడ్డాక చంద్రబాబుదే బాధ్యత అంటూ ‘నారాసుర రక్తచరిత్ర’ అనే శీర్షికతో చంద్రబాబు కత్తి పట్టుకుని ఊచకోత కోస్తున్నట్లు దారుణమైన గ్రాఫిక్ చేయించి కథనాలు వడ్డించింది సాక్షి మీడియానే. అంత దారుణమైన తప్పులు చేసి దేనికీ సవరణలు ఇవ్వని, క్షమాపణలు చెప్పని సాక్షి.. ఇప్పుడు ఈనాడు చేసిన చిన్న తప్పిదానికి ఇంత యాగీ చేయడమే విడ్డూరం.