అన్నా, చెల్లీ మధ్యలో ఆమె

వైఎస్ కుటుంబ విభేదాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. తన మాట వినని షర్మిలను పూర్తిగా దూరం చేయాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాల వెనుక జగన్ కంటే ఆయన భార్య భారతీరెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా తాజాగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు షర్మిల పేరే కనిపించకూడదన్నట్లుగా వైఎస్ భారతి ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం . జగన్ తన తల్లిని, చెల్లిని దూరం పెట్టడంలో భారతి కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. షర్మిలను సపోర్టు చేసే వారిని సైతం ఎలా దెబ్బకొట్టాలో, ఎలా దూరంగా ఉంచాలో భారతి పెద్ద స్కెచే వేస్తున్నారట..

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న కొర్రు భాస్కర్ రెడ్డి (కడప జిల్లా వాసి).. ప్రతీ ఏడాది జయంతి రోజున ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటారు. వైఎస్ పై అభిమానంతో ఇచ్చే యాడ్స్ సాక్షి పత్రికలో ప్రచురితమవుతుంటాయి.ఈ సారి మాత్రం యాడ్స్ తీసుకుని అంతా సెట్ అయిన తర్వాత వైఎస్ జయంతికి ఒక రోజు ముందు వాటిని సాక్షి యాజమాన్యం తిరస్కరించింది. యాడ్ లో షర్మిల ఫోటో ఉన్నందున వాటిని తీసుకోలేమని చెప్పేసింది. ఎందుకంటే భారతి వద్దన్నారని సాక్షి సిబ్బంది నేరుగానే చెప్పేశారు. దానితో కోపగించుకున్న కొర్రు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేర్వేరు సెక్షన్ల కింద కోర్టులో కేసు వేశారు. యాడ్ కోసం తాను చెక్కు కూడా ఇచ్చానని, రసీదు జారీ చేసిన తర్వాత ప్రకటన వేయలేమన్నారన్నది భాస్కర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. సాక్షి ఛైర్మన్ భారతీ రెడ్డిపై ఆయన కేసు పెట్టారు.

భారతీ యాడ్స్ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి చర్యల ద్వారా షర్మిలను మరింత దూరం పెట్టే ప్రక్రియ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే దీని వెనుక బారతీ రెడ్డి ఉన్నారన్న సంగతి మాత్రం ఇప్పుడే బయటపడింది. వారసత్వంగా షర్మిలకు అందాల్సిన వైఎస్ ఆస్తిలో వాటాను కూడా ఆమెకు అందకుండా భారతి అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల, విజయలక్ష్మీ ఇద్దరు హైదరాబాద్ లో సెటిలైపోవడానికి భారతే కారణమని చెబుతున్నారు. అసలు షర్మిల పేరెత్తితేనే భారతి ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే…