వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెట్టేసింది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట మార్చి 18 నుంచి 26 వరకు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించిన ఆయన ఇప్పటికే నిర్వహించిన గడప గడపకు వైసీపీకి కార్యక్రమంపై రివ్యూ చేయడంతో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు తప్పలేదు. జగన్ మినహా మిగతా 150 మంది ఎమ్మెల్యేలలో 30 మందికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో మంత్రుల స్థాయి నేతలూ ఉన్నారు.
30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహించిన జగన్.. ఇప్పుడు చేపట్టబోయే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వారు మెరుగుపడకపోతే వైసీపీలో వారికి భవిష్యత్తు ఉండదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి హెచ్చరించినా పనితీరు మెరుగుపర్చుకోలేదని… ఇదే చివరి అవకాశమని నిర్మొహమాటంగా జగన్ చెప్పారట. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం 9 రోజులు పూర్తిగా కష్టపడాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని… లేదంటే వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం తన వద్దకు రావొద్దని క్లియర్ గా చెప్పారంటున్నారు.
జగన్ నుంచి హెచ్చరికలు అందుకున్నవారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. జగన్ నుంచి సీరియస్ వార్నింగ్ అందుకున్న వారిలో సామినేని ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరకదని.. వారికి కాకపోతే కుటుంబ సభ్యులకైనా టికెట్ తెచ్చుకోవచ్చనే భ్రమలో ఉండొద్దని కూడా స్పష్టంగా చెప్పేశారంటున్నాయి వైసీపీ వర్గాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates