ఏపీలో మూడు రాజ‌ధానులు లేవ్‌: మంత్రి బుగ్గ‌న

Buggana Rajender Reddy
Buggana Rajender Reddy

ఏపీలో మూడురాజ‌ధానుల జ‌పం చేస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు లేవ‌ని.. ఉన్న‌ది ఒక‌టే రాజ‌ధాని అని.. అదికేవ‌లం విశాఖేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వంలో నెంబ‌రు 2గా ఉన్న మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని అన్నారు. అంతేకాదు.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ రాజధాని అంశంపై మంత్రి బుగ్గ‌న‌ను ప‌లువురు పెట్టుబడిదారులు ప్రశ్నలు అడిగారు. విశాఖ పైనే ఎందుకు దృష్టి పెట్టారు.. పారిశ్రామిక గ్రోత్ ఏరియాగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదని ఆర్థిక మంత్రి బుగ్గనను పెట్టుబడిదారులు ప్రశ్నించారు.

ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని, దీంతో పాటు తమ ప్రభుత్వం విశాఖనే రాజ‌ధానిగా నిర్ణయించిందని మంత్రి వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని తేల్చి చెప్పారు.

విశాఖ‌లో అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి బుగ్గ‌న‌ తెలిపారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని అన్నారు. ఇక‌, క‌ర్నూలు విష‌యాన్ని కూడా పెట్టుబ‌డి దారులు ప్ర‌శ్నించారు. దీనికి మంత్రి బుగ్గ‌న స్పందిస్తూ.. కర్నూలు అనేది రాజధాని కాదని.. అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.