దేశంలో అన్నింటికన్నా గొప్పది ఏదీ.. అంటే రాజ్యాంగం. మరి దాని తర్వాత ఏదీ అంటే.. రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టు. న్యాయవ్యవస్థ. ఎంతటి వారైనా.. ఆఖరుకు దేశానికి ప్రధానులైనా ఈ రెండింటికీ కట్టుబడాల్సిందే. ఇది ఎవరైనా చేస్తారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలతో కోర్టుకురావాలని ఆదేశాలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.
మరి.. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి ఉందా? అంటే.. లేదు. కోర్టులకు.. అవి ఇచ్చే ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ నాయకులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. కనీసం పట్టించుకోవడం లేదని కొన్నాళ్లుగా విమర్శలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా సాక్షాత్తూ సీఎం జగన్‌ను కోర్టుకు రావాలంటూ.. విజయవాడలోని ఎన్ఐఏ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
దీనికి బుధవారమే(ఫిబ్రవరి 15) ముహూర్తమని కూడా ప్రకటించింది. కానీ, జగన్ మాత్రం కోర్టును..దాని ఆదేశాలను పట్టించుకోలేదు. నేరుగా కడపకు వెళ్లిపోయారు. అక్కడ స్టీల్ ప్లాంటుకు మరోసారి శంకుస్థాపన చేశారు. దీంతో సీఎం జగన్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఇదీ.. విషయం
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కోడికత్తితో ఆయనపై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ బుధవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగింది. సదరు కేసులో బాధితుడుగా ఉన్న జగన్, ప్రత్యక్షసాక్షి దినేష్ , జగన్ పీఏ కేఎన్‌ఆర్ విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ఇక, దాడి సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు అసిస్టెంట్ కమాండ్‌ర్‌గా దినేష్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాయపూర్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోడికత్తి దాడి కేసులో దినేష్ మొదటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి మరణించడంతో గతంలో కేసు విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. దీంతో బుధవారం విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
అదేసమయంలో సీఎం జగన్ కూడా తనకు జరిగిన ‘ఘోరం’పై కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయడమో.. ఆరోజు ఏం జరిగిందో చెప్పాల్సి ఉంది. కానీ, సీఎం జగన్ కోర్టుకు కాకుండా కడప జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. ఇదీ..సంగతి!!
Gulte Telugu Telugu Political and Movie News Updates