ఏపీ ప్రభుత్వం రూటు మార్చింది. ఇప్పుడు మూడు రాజధానులు లేవని అంటోంది. పరిపాలన మొత్తం విశాఖ నుంచే ఉంటుందని ఇంతకాలం సూచన ప్రాయంగా చెప్పిన వైసీపీ ఇప్పుడు బహిరంగంగానే ఆ విషయాన్ని వెల్లడిస్తోంది. విశాఖే పరిపాలనా రాజధానికి సరిపోతుందని ప్రభుత్వం అంటోంది.
బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందన్నారు. కర్ణాటకలో దార్వార్డ్ , గుల్బర్గల్లో బెంచ్ లు ఉన్నట్టే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ కర్నూలులో ఉంచాలని అనుకుంటున్నామన్నారు. అలాగే అసెంబ్లీ విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటక ప్రభుత్వం బెల్గాంలో అసెంబ్లీ సెషన్ నిర్వహించినట్లే గుంటూరులో కూడా ఒకటి రెండు సార్లు అసెంబ్లీ పెడతామన్నారు. అంటే శాసన రాజధాని, న్యాయ రాజధాని ఉండవని ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లయ్యింది..
రాజధానిగా విశాఖ అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని బుగ్గన చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న మౌళిక సదుపాయాలు భవిష్యత్తులో మరింత అభివృద్ది చెందే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. విశాఖ ఒక పోర్టు సిటీ అని, అక్కడ వాతావరణం బావుంటుందని అభిప్రాయపడ్డారు. పైగా కాస్మోపాలిటన్ సంస్కృతి ఉన్న నగరమని బుగ్గన గుర్తు చేశారు. విశాఖలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు. కాకపోతే బుగ్గన ఎందుకిలా మాట్లాడున్నారనే విషయం వివరించి చెప్పాలని అవసరం లేదని, జగన్ ను సంతృప్తి పరిచేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. రాజధాని అమరావతి దాటి పోవడం కుదరని పని అని వాదిస్తున్నారు..