తాజా వికెట్ – మాగుంట అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ దక్షిణాది వైపు వేగవంతమైంది. సౌత్ గ్రూపుపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అరెస్టుల పర్వం కొనసాగిస్తూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల పంజాబ్ కు చెందిన ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ.. అతనిచ్చిన సమాచారం ఆధారంగానే నిన్న రాఘవరెడ్డిని విచారణకు పిలించింది సాయంత్రం అదుపులోకి తీసుకుని ఇవాళ అరెస్టు ప్రకటించింది.

రెండో రౌండ్ అరెస్టుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేశారు. రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక సంస్థ ఒకరిని అరెస్టు చేస్తే మరో సంస్థ మరో సంస్థ వేరొకరిని టార్గెట్ చేస్తూ కొత్త విషయాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఈడీ రెండు చార్జ్ షీటులు దాఖలు చేసింది. సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి 160 సీఆర్పీసీ కింద కవితను ప్రశ్నించి వెళ్లారు. త్వరలో 41ఏ సీఆర్పీసీ కింద ప్రశ్నిస్తారని చెబుతున్నారు. 41ఏ అంటే ఇక నిందితురాలిగా చేర్చినట్లేనని భావించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి అందించే సమాచారం ఆధారంగా కవితపై చర్యలుంటాయని చెబుతున్నారు.

ఇక సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు సమాచారం. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నుంచి పెద్ద వాళ్లను కూడా ఈడీ అధికారులు విచారిస్తారనడంలో సందేహం లేదు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.