మోదీ, అమిత్ షా మధ్య దూరం నిజమేనా?

కొద్దిరోజులుగా దిల్లీ స్థాయిలో జరుగుతున్న ఓ ప్రచారం రాష్ట్రాలకూ పాకుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మధ్య దూరం పెరుగుతోందని, ఇద్దరి మధ్య సయోధ్య పూర్తిగా కొరవడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

దీనికి అనేక ఉదాహరణలు, అనేక కారణాలు చూపిస్తున్నారు ఈ ప్రచారం చేస్తున్నవారు. మోదీ అదానీకి విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడాన్ని అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని… తన కుమారుడు జై షా‌ను ప్రోత్సహించడానికి మోదీ అంగీకరించడం లేదన్న కోపం అమిత్ షాలో ఉందని చెప్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌లో అదానీ కంపెనీల అవతవకల గురించి రావడంతో అమిత్ షాకు మరింత బలం దొరికిందని.. ఆయన నేరుగానే ఈ విషయంలో మోదీపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు మోదీ కూడా చాలాకాలంగా అమిత్ షాను దూరం పెడుతున్నారని, అమిత్ షా లేకపోతే మోదీ లేరు అనే భావన చెరిపేయాలని… బీజేపీ అంటే మోదీ ఒక్కరే అనే ముద్ర కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అయితే, పార్టీ అవసరాలు, రాజకీయ వ్యూహాల కోసం ఆయన భూపేంద్ర యాదవ్‌పై ఆధారపడుతున్నట్లుగా చెప్తున్నారు.

ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఎక్కడా అమిత్ షా ఫొటోలు లేవని.. మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలు మాత్రమే కనిపించాయని అంటున్నారు.

భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం మోదీ కేబినెట్లో కార్మిక, ఉపాధి కల్పన, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు ఎన్నికల వ్యూహాలలో దిట్టగా పేరుంది. గతంలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ విజయాలు సాధించడంలో ఆయన పాత్ర ఉంది. ప్రస్తుతం మోదీ ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు.

అయితే.. బీజేపీకి చెందిన మరికొందరు మాత్రం ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అని… మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు తలెత్తి ఆ పార్టీ నాయకత్వ సమస్యలో మునిగి దెబ్బతినాలన్న దుష్ట కోరికతోనే వారు అంలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు బీజేపీకి చెందిన పలువురు నేతలు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ ఇలాంటి కథలు అల్లుతుంటుంటే అది చూసి మరికొన్ని కాంగ్రెస్ అనుకూల మీడియాలు కూడా అదే ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నారు. మోదీ, అమిత్ షాల మధ్య బంధం ఎన్నో పరీక్షలకు తట్టుకుని నిలిచిందని… వారి మధ్య విభేదాలు అనేది కాంగ్రెస్ కలే తప్ప ఇంకేమీ కాదంటున్నారు.

అదేసమయంలో భూపేంద్ర యాదవ్‌కు మోదీతో చాలాకాలంగా మంచి రేపో ఉందని.. ప్రస్తుతం జీ20కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో దేశంలో విస్తృతంగా సమావేశాలు జరుగుతున్నాయని.. జీ20లో కీలకమైన పర్యావరణం, వాతావరణ మార్పులు, ఉపాధి కల్పన వంటివన్నీ కేంద్ర మంత్రివర్గంలో భూపేంద్ర యాదవ్ శాఖలు కావడంతో ఆయన మరింత తరచుగా మోదీని కలిసి మాట్లాడడం, వివరాలు ఇవ్వడం జరుగుతోందని.. అంతే తప్ప అది అమిత్ షాను దూరం పెట్టి భూపేంద్ర యాదవ్‌ను ప్రోత్సహించడం కాదని అంటున్నారు.