ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీకి ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఇంకా పోలేదు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్ కావాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలన్నీ కలిసి రావాలన్న సత్యం ఇంకా అర్థం చేసుకోని ఆయన పదేపదే తన మనసులోని మాటను బయటపెడుతున్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు కూడా ఆయన జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీ చేస్తానని చెప్పారు. ఇలా సందర్భం దొరికిన ప్రతిసారీ ఆయన తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్తున్నారు.
వాస్తవానికి వైసీపీ, టీడీపీలకు ఏ నియోజకవర్గంలోనూ అభ్యర్థులు దొరకని పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల టికెట్ ఇవ్వదగినవారు ఇద్దరు ముగ్గురు ఉంటుంటారు. వారిలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు, కులపరంగా ఈక్వేషన్స్ అన్నీ కుదిరినవారు, బలమైన రాజకీయ కుటుంబాలకు చెందినవారు, అనేకసార్లు గెలిచినవారు… ఇలా అనేక అర్హతలతో అభ్యర్థులు కావాల్సినంతమంది ఉంటున్నారు. కొత్తగా టికెట్ కోరుకునేవారు కూడా ఇలాంటి అర్హతలతో ఉంటున్నారు.
అలీ కూడా సినీ నటుడిగా ఆదరణ ఉన్న వ్యక్తే. ఆర్థికంగా కూడా బలవంతుడే. అయితే, రాజకీయాలను ఫుల్ టైం కెరీర్‌గా తీసుకున్నవారు ఎన్నికల్లో ధారాళంగా ఖర్చు పెట్టగలుగుతారు. అలీ కూడా ఆర్థికంగా బలవంతుడే , కానీ రాజకీయాలే శ్వాసగా బతికేవారిలా పదుల కోట్లు ఖర్చు చేయడానికి ఆయనకు ధైర్యం చాలకపోవచ్చు. అంతేకాదు.. ఎక్కడ టికెట్ ఇచ్చినా అక్కడ టికెట్ రావాల్సిన నేతలను తనకు మద్దతుగా మార్చుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలూ చేయాల్సి ఉంటుంది.
అవన్నీ అలీకి ఎంతవరకు సాధ్యమన్నది అనుమానమే. అంతేకాదు… పార్టీలో కూడా జగన్ వద్ద చనువు తప్ప ఇతర నేతల దగ్గర అలీకి పట్టు లేదు. ముఖ్యంగా జగన్ కంటే కూడా టికెట్ల విషయంలో ప్రభావితం చేసే అత్యంత కీలకమైన ఒకరిద్దరు నేతల ఆశీస్సులు ఉంటేనే పని జరుగుతుంది. కానీ, అలీకి పార్టీలో అందరి దగ్గరా ఏమంత గ్రిప్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అలీకి టికెట్ రావడం అసాధ్యమని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయినా, అలీ మాత్రం ఎమ్మెల్యే కలల్లో తేలిపోతూ పదేపదే తన మనసులోని మాటను బయటపెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates