ఆయన చిన్నప్పుడు నేషనల్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్. జాతీయ స్థాయిలో అనేక టోర్నమెంట్లు ఆడారు. 1986 జాతీయ క్రీడల్లో కాంస్య పతకం దక్కించుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన టెన్నిస్ కోర్టులను దున్నేశారు. ఈ సారి మాత్రం పొలిటికల్ కోర్టు కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా చూస్తున్నారు..
నాదేండ్ల మనోహర్ ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు. విభజనతో తర్వాత ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినడంతో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరారు. పవర్ స్థార్ ఆయన్ను బాగానే చూసుకుంటున్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. పవన్ ఎక్కడ ఉంటే మనోహర్ అక్కడుంటారు. పవన్, నాగబాబు తర్వాత పార్టలో స్థానం నాదెండ్ల మనోహర్ దేనని చెప్పాలి.
2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైంది. నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా అదే. తాను రెండు సార్లు గెలిచిన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2024లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాదెండ్ల మనోహర్ తనకు తెలిసిన వారి వద్ద వాపోతున్నట్లు సమాచారం..
టీడీపీ, జనసేన పొత్తు ఖరారైతే తెనాలి సీటుకు ఎసరు వస్తుందని మనోహర్ భయపడుతున్నారు. టీడీపీ తరపున ఆలపాటి రాజా, తెనాలి స్థానానికి కర్చిఫ్ వేసి కూర్చున్నారు. పైగా నియోజకవర్గంలో తిరుగుతూ అందరినీ మంచి చేసుకునే పనిలో ఉన్నారు. గుంటూరులో తనకు టికెట్ ఇవ్వకపోతే తెనాలి ఖాయమని ఆలపాటి రాజా అందరికీ చెప్పుకుంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు దగ్గర పైరవీలు కూడా చేశారట. దానితో తెనాలి నియోజకవర్గంపై మనోహర్ కు డౌట్లు ఏర్పడ్డాయి.
నాదెండ్ల మనోహర్ ఉమ్మడి గుంటూరు జిల్లాను దాటి పోలేని పరిస్థితిలో ఉన్నారు. తెనాలి దక్కకపోతే పొత్తులో భాగంగా ప్రస్తుత పల్నాడు జిల్లాలో భాగమైన సత్తెనపల్లి తనకు కేటాయిస్తారన్న ఆశాభావంలో ఆయన ఉన్నారు. పవన్ కు తెలిసేట్టుగా జనసేన నేతల దగ్గర ఆయన ఈ మాటలు చెబుతున్నారు. అయితే సత్తెనపల్లికి కూడా జనసేనలో పోటీ పెరుగుతోంది. సత్తెనపల్లిలోనే ఉన్న కొందరు నేతలు, గంటూరు నుంచి దిగుమతైన గాదె లాంటి నేతలు కాచుకు కూర్చున్నారు. కాకపోతే అంతలోనే కథ ఒక ట్విస్ట్ తిరిగింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీకి బై చెప్పి.. జనసేనలో చేరిన పక్షంలో ఆయనకు సత్తెనపల్లి కేటాయించడం ఖాయమని చెబుతున్నారు. పైగా కన్నా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన పెద కూరపాడు నియోజకవర్గం సత్తెనపల్లిని ఆనుకునే ఉంటుంది.
సత్తెనపల్లిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో తనకు వారి ఓట్లతో పాటు జనసేనకు సంప్రదాయంగా వచ్చే కాపు ఓట్లు దక్కితే విజయం ఖాయమని మనోహర్ ఎదురు చూశారు. కన్నాకే టికెటిచ్చే అవకాశాలున్నాయని తెలియడంతో మనోహర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కొత్త నియోజకవర్గం వేటలో మునిగిపోయారు…
Gulte Telugu Telugu Political and Movie News Updates