ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ – ప్యాక్ నిర్వహించిన సర్వే ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చినట్లు సమాచారం.
ఐదుగురు మంత్రులకే ఛాన్స్
ఏపీ కేబినెట్లో పాతిక మంది మంత్రులున్నారు. అందులో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజా లకు మాత్రమే గెలుపు అవకాశం ఉన్నట్లు ఐ ప్యాక్ తేల్చింది. మిగతావారు ఘోరంగా ఓడిపోతారని తమ సర్వే రిపోర్టుల ఆధారంగా తెలిపింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం మరికొన్ని నియోజకవర్గాల్లో మంత్రులపై వ్యతిరేకతే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి..
కొడాలి నాని గెలుస్తారా ?
ఎవరు గెలిచినా గెలవకపోయినా మాజీ మంత్రుల్లో కొడాలి నానికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. గుడివాడ నియోజకవర్గం ప్రజలతో నానికి ఉన్న అనుబంధం, మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి కావాల్సినవి చేసి పెట్టడం లాంటి చర్యల కారణంగా ఆయనకే ఓటు వేస్తామని జనం చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కూడా గెలుపు అవకాశాలున్నట్లు సర్వే చెబుతోంది. నిజానికి పదవి పోయేంత వరకు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరికీ బూతుల మంత్రులని పేరు ఉండేది. అయినా జనంలో ఉన్న పరపతి కారణంగా వాళ్లు గెలవబోతున్నారని ఐ ప్యాక్ అంటోంది..
దెబ్బకొట్టిన గడప గడపకు కార్యక్రమం
జగన్ ఆదేశాల మేరకు నిర్వహించిన గడప గడపకు కార్యక్రమం కూడా వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందన్న వాదన వినిపిస్తోంది. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై జనం నిలదీస్తుంటే వైసీపీ నేతలు నీళ్లు నములుతూ తమను మరింత ఇరకాటంలోకి నెట్టుకున్నారు. సమాధానమే చెప్పలేని వారికి ఎందుకు ఓటెయ్యాలని తటస్థులు ప్రశ్నించుకుని వైసీపీకి దూరం జరిగారట. పైగా ప్రభుత్వోద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోంది.