పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి.

కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెర్చ్ చేయాలని ఆయన అన్నారు.

అంతేకాదు.. కంటివెలుగును పూర్తిగా ప్రచార కార్యక్రమంగా పేర్కొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకం ప్రచారానికి భారీగా ఖర్చు చేసిందని.. చివరకు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లో కూడా పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందంటూ విమర్శలు కురిపించారు. కంటివెలుగు పథకానికి రూ. 200 కోట్లు కేటాయిస్తే అందులో 50 కోట్లు ప్రచారానికే వాడారని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కంటి సమస్యలున్నవారికి ఇచ్చే కళ్లద్దాల విలువ రూ. 35 కాగా కేసీఆర్ పెట్టుకునే కళ్లద్దాల విలువ రూ. 9 లక్షలని ఆయన ఆరోపించారు. గత కంటి వెలుగు కార్యక్రమం వల్ల తెలంగాణలో 18 మంది అంధులయ్యారని.. అలాంటిది జరగకుండా మళ్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని నర్సయ్యగౌడ్ అన్నారు. టెండర్లు పిలవకుండానే ఈ కళ్లద్దాల కాంట్రాక్టును ఓ బీఆర్ఎస్ నేతకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

కంటివెలుగు కార్యక్రమం నిజంగా మంచి ఉద్దేశంతో చేపడితే అందుకోసం కొత్తగా డాక్టర్లను నియమించాల్సి ఉందని.. కొత్తగా తెలంగాణలో ఒక్క డాక్టరును కూడా నియమించలేదని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని బూర ఆరోపించారు.

మొత్తానికి బీజేపీలో చేరిన ఇన్ని నెలలకు బూర తన నోటికి పని చెప్పారని ఆ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. బూర ఇదే ఊపు కంటిన్యూ చేయాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారట. మరి.. వారి కోరికను ఆయన ఎంతవరకు తీర్చుతారో చూడాలి.