ఏదైనా చెబితే అతికినట్లుగా ఉండాలి. అబద్ధాన్ని సైతం అడ్డగోలు వాదనతో వినిపించటంలో మాత్రం ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ముందుంటారన్న మాట ఏపీ ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. తన తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఆయన వినిపించే వాదన విన్నోళ్లంతా నోరు నొక్కుకునే పరిస్థితి. అయినప్పటికీ వెనక్కి తగ్గని మంత్రిగారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫోటోలను చూసిన తర్వాత అయినా తన పద్దతిని మార్చుకుంటారా? లేదంటే పాచిపోయిన వాదననే వినిపిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లని ఏపీ మంత్రి మీద పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. మార్చిలో విశాఖ వేదికగా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. అందుకనే దావోస్ కు వెళ్లలేదన్న మాట అతికినట్లుగా లేకపోవటం తెలిసిందే. మంత్రి మాటలు విన్న వారంతా.. ఆయన తెలివికి నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే.. మరో రెండు నెలల్లో విశాఖలో భారీ సదస్సును నిర్వహిస్తున్నప్పుడు.. దావోస్ వేదికగా వచ్చే ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలకు ఏపీ గురించి చెప్పే అరుదైన అవకాశాన్ని ఎలా మిస్ చేసుకుంటారని చెబుతున్నారు.
మరింత బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. మీరో హోటల్ ను ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ప్రచారాన్ని.. హోటల్ కు చుట్టుపక్కల ఉన్న బస్టాండ్.. షాపింగ్ మాల్స్ లేదంటే జనం ఎక్కువగా తిరిగే చోటుకు వెళ్లి.. కరపత్రాలు కానీ ఇంకేదైనా కూపన్లు కానీ ఇవ్వటమో.. లేదంటే అందరికి కనిపించేలా ఫ్లెక్సీలు పెడితే కొత్తగా హోటల్ ఒకటి వచ్చిందన్న విషయం అర్థమవుతుంది. అంతే తప్పించి.. మనం మన హోటల్ లో కూర్చొని.. మరో రెండు నెలల్లో ఒక భారీ ప్రోగ్రాం పెడదాం.. దెబ్బకు అందరూ వచ్చేస్తారనుకోవటంలో అర్థం ఉండదు కదా?
అలానే దావోస్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వస్తుంటారు. ఇలా వచ్చిన వారిని ఒకేచోట కలిసేందుకు.. వారితో మరింత సన్నిహితంగా మెలిగేందుకు దావోస్ లాంటి వేదికలు ఉపయోగపడుతుంటాయి. ఈ మాత్రం అవగాహన లేని గుడివాడ అందుకు భిన్నమైన వాదనను వినిపించటం చూస్తున్నాం. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ వేదికగా ఎంతలా చెలరేగిపోవటం.. భారీగా పెట్టుబడుల ప్రకటనల్ని రోజువారీగా చేయటం చూస్తున్నాం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్ ఎంపీగా వ్యవహరిస్తున్న గల్లా జయదేవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆయనకు చెందిన అమర్ రాజా కంపెనీ రూ.9500 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? అని అడగటం.. దానికి సంబంధించిన వివరాలు గల్లా జయదేవ్ షేర్ చేసుకోవటం జరిగాయి. గల్లాతో తాను దిగిన ఫోటోను కేటీఆర్ షేర్ చేశారు.
రాజకీయాన్ని పక్కన పెడితే.. ఒక పారిశ్రామికవేత్తను తన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే విషయంలో ఎంత చురుకుగా.. మరెంత దూకుడుగా వ్యవహరిస్తే అంత మంచిది. ప్రభుత్వం తమ పట్ల ప్రదర్శించే సానుకూలతలకు ఏ పారిశ్రామికవేత్త అయినా సంతోషిస్తాడు. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. గల్లా జయదేవ్ ను కలవాలనుకుంటే ఆయన్ను హైదరాబాద్ లో కూడా కేటీఆర్ కలవొచ్చు.
దావోస్ లాంటి వేదికల మీద కలిసినప్పుడు.. తన వరకు వచ్చే విషయాల్ని షేర్ చేసుకోవటం.. మరికొందరు పారిశ్రామికవేత్తల్ని కలిపేందుకు సాయం చేయొచ్చు. ఏమైనా జరగొచ్చు. అందుకే అవకాశాలు ఉన్న దగ్గరకు వెళ్లాలే కానీ.. అవకాశాలే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాయనట్లుగా వ్యవహరించే గుడివాడ వారి తన పాచిపోయిన వాదనను పక్కన పెట్టేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయం ఆయనకు అర్థమవుతుందా?