రఘునందన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన తోట

సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు అంతే తీవ్రస్థాయిలో రిటార్టు ఇచ్చారు బీఆర్ఎస్ ఏపీ వ్యవహరాల బాధ్యుడు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ లో చేరినందుకు ప్రతిగా తనకు మియాపూర్ లో భారీ ఎత్తున భూముల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన తోట చంద్రశేఖర్ ఘాటుగా రియాక్టు అయ్యారు.

ఖమ్మంలో జరిగే బహిరంగ సభను డైవర్ట్ చేయటానికే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తుంటారని.. ఆయన మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. రఘునందన్ ఆరోపణల్ని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు. అంతేకాదు.. రఘునందన్ చెప్పినట్లుగా సదరు సర్వే నెంబర్లో భూమి తనకు కట్టబెట్టి ఉంటే.. అందులో 90 శాతం రఘునందన్ తీసేసుకొని.. మిగిలిన 10 శాతం తనకు ఇస్తే సరిపోతుందంంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.

పూర్వ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సాయంతో..మియాపూర్ లో రూ.4 వేల కోట్ల విలువైన భూములను తోట చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించినట్లుగా ఆరోపణలున్నాయి. దీనికి బీజేపీ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రఘునందన్ కారణమని చెప్పాలి.

ఆయన వాదన ప్రకారం తోట చంద్రశేఖర్ కు 40 ఎకరాల మియాపూర్ భూముల్ని కట్టబెట్టారని.. అందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారిన వేళ.. అందుకు ధీటైన రిటార్టును ఇచ్చారు తోట చంద్రశేఖర్. మరి.. తాజా కౌంటర్ పై రఘునందన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.