టీడీపీకి సంకేతాలు పంపిస్తున్న కిల్లి కృపారాణి

శ్రీకాకుళం మాజీ ఎంపీ, వైసీపీ నేత కిల్లి కృపారాణి ఆ పార్టీ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కింజరాపు ఎర్రంనాయుడిపై గెలిచిన నేతగా ఆమెకు రికార్డు ఉంది. ఆ రికార్డు కారణంగానే ఆమె అప్పట్లో కేంద్రంలోనూ మంత్రి పదవి దక్కించుకున్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా బరిలో ఉన్నందున ఓట్లు చీలి విజయం దక్కించుకున్న కృపారాణి 2014లో రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 2019లో ఆమె పోటీ చేయలేదు. అనంతరం వైసీపీలో చేరిన ఆమె టెక్కిలి అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కానీ… టెక్కలి అసెంబ్లీ సీటు దువ్వాడ శ్రీనివాస్‌కు ఇప్పటికే ఖరారు చేశారు జగన్. పోనీ పార్లమెంటు సీటుకు వైసీపీ నుంచి పోటీ చేద్దామనుకున్నా డాక్టర్ దానేటి శ్రీధర్ ఇప్పటికే అక్కడ కర్చీఫ్ వేశారు. శ్రీకాకుళం రాజకీయాల్లో కీలకంగా ఉన్న ధర్మాన సోదరులు ఇద్దరూ, దువ్వాడ శ్రీనివాస్ కూడా దానేటి పేరునే జగన్ వద్ద పదేపదే ప్రతిపాదిస్తున్నారు. దీంతో కిల్లి కృపారాణికి ఈసారి టికెట్ అనుమానంగా మారింది.

ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో టికెట్ ఎలాగూ రాదు కాబట్టి టీడీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న సమాచారం. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కృపారాణి ఆర్థికంగా బాగా బలవంతురాలు. కృపారాణి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కారణంగానే చిరంజీవి సినిమాల్లో కృపారాణి కుమారుడికి చిన్నచిన్న పాత్రలు ఇచ్చిన సందర్భాలున్నాయి.

దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్ సాధించలేకపోయినా టీడీపీలో చేరి రాజ్యసభ సీటయినా సాధించాలని ఆమె ఆశపడుతున్నారట. పదేళ్లుగా పదవులు లేకుండా ఖాళీగా ఉండడం రాజకీయంగా దెబ్బతీస్తుందని ఆమె ఆందోళన చెందుతున్నారని టాక్. అందుకే టీడీపీలో చేరి సొంత డబ్బులు ఖర్చుపెట్టయినా ఆ పార్టీ విజయానికి సహకరించడం ద్వారా అక్కడ రాజ్యసభ సీటు కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇదంతా అంత సులభం కానప్పటికీ తనకు టికెట్ ఇవ్వడానికి సతాయిస్తున్న వైసీపీని దెబ్బకొట్టాలని ఆమె తన అనుచరుల వద్ద అన్నట్లు సమాచారం.

కొద్దినెలల కిందట జగన్ శ్రీకాకుళంలో పర్యటించినప్పుడు కూడా ఆమె తనకు సరైన గౌరవం దక్కలేదంటూ వెళ్లిపోయారు. జగన్‌ను ఆహ్వానించే నేతల జాబితాలో ఆమె పేరు లేకపోవడం, పోలీసులు ఆమెను హెలిప్యాడ్ వద్దకు రానివ్వకపోవడంతో ఆగ్రహించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు పార్టీలో గౌరవం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారట. ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీలో చేరితే భవిష్యత్తులోనైనా ఏదో ఒక పదవి దక్కించుకోవచ్చే ఆలోచనలో ఆమె వైసీపీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారట. కానీ.. టీడీపీ నుంచి మాత్రం ఆమె విషయంలో సానుకూలత లేదని టాక్. పార్టీలోకి ఆమె వస్తే పదవులు, టికెట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు వస్తాయన్న కారణంతో టీడీపీ ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపడం లేదని వినికిడి.