నంద‌మూరి కుటుంబానికి చంద్ర‌బాబు ‘సంక్రాంతి’ కానుక‌..!

నంద‌మూరి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంక్రాంతి కానుక ఇచ్చారా? ఆ కుటుంబంతో ఉన్న రాజ‌కీయ అనుబంధాన్ని మ‌రింత పెంచుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నేత‌లు. కీల‌క‌మైన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను నంద‌మూరి కుటుంబానికి క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు పెద్ద ఎత్తున టీడీపీలో చ‌ర్చ‌సాగుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు నందమూరి కుటుంబానికి ఈ కానుక ఇచ్చార‌ని మీడియా వ‌ర్గాల‌కు స‌మాచారం అందింది. దీంతో టీడీపీ శ్రేణు్ల్లో ఉత్సాహం నెల‌కొంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌నేది తెలిసిందే. ఒక‌టి టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఒక‌ప్ప‌టి నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌క్కించుకోవ‌డం ఒక ల‌క్ష్యం అయితే.. మ‌రొక ప్ర‌ధాన కార‌ణం.. త‌న‌పైనా.. త‌న‌కుటుంబంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. త‌న కుటుంబాన్ని అవ‌మానించిన మాజీ మంత్రి కొడాలి నానిని మ‌ట్టి క‌రిపించాల‌నేది మ‌రో కార‌ణం. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు అనుకూల మైన వ్య‌క్తుల కోసం వెతుకుతున్నారు. ప్ర‌స్తుతానికి రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ప‌గ్గాలు అప్ప‌గించారు.

అయితే.. గతంలో ఆయ‌న ఒకసారి మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకుని ఉండ‌డం.. ఇప్పుడు నాని మ‌రింత బ‌లంగా ఉండ‌డంతో రావి గెలుపుపై చంద్ర‌బాబు కొన్ని సందేహాలు నెల‌కొన్నాయి. దీంతో ఎన్నారై వ్యాపార వేత్త‌ను ఇక్క‌డ నుంచినిల‌బెట్టాల‌ని భావించారు. దీనికి అన్ని వైపుల నుంచి సంకేతాలు కూడా వ‌స్తున్న క్ర‌మంలో అనూహ్యంగా నంద‌మూరి కుటుంబం నుంచి తార‌క‌ర‌త్న ఎంట్రీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నికల్లో రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆ వెంట‌నే ఆయ‌న గుంటూరులోనూ ప‌ర్య‌టించారు.

ఇక‌, ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం అయితే.. ప‌స‌లేద‌ని భావిస్తున్న తార‌క‌త‌ర్న‌.. త‌న తాత‌, పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పుట్టిన నియోజ‌క‌వ‌ర్గం (పొరుగునే ఉంది) నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే.. అది రిజ‌ర్వ‌డ్ కావ‌డంతో గుడివాడ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. దీనిపై మొద‌ట్లో త‌ట‌ప‌టాయించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు బాల‌య్య ఎంట్రీతో సంక్రాంతి సంద‌ర్భంగా.. ఓకే చెప్పార‌ని.. తెలిసింది. తార‌క‌రత్న‌ను గెలిపించుకునే బాధ్య‌త నంద‌మూరి కుటుంబం తీసుకుంటుంద‌ని బాల‌య్య ప్ర‌త్య‌క్షంగా చెప్పి హామీ ఇచ్చార‌ని.. దీంతో బాబు ఓకే చేశార‌ని టాక్‌.