గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 151 స్థానాలు చేజిక్కించుకుని అఖండ విజయాన్నందుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో 151 ఏంటి.. మొత్తంగా 175 సీట్లనూ మనమే గెలిచేద్దాం అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపదేశం చేస్తున్నారు సీఎం జగన్. కానీ వైకాపాలోనే ఉన్న మాజీ మంత్రి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన డీఎల్ రవీంద్రా రెడ్డి మాత్రం 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి పది సీట్లు కూడా రావడం కష్టమంటున్నారు.
వైకాపా ఆ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని ఆయన తేల్చేశారు. వైఎస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా కలిసి సాగిన డీఎల్.. వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు. కడప జిల్లాలో ఆయన వైఎస్‌కు అత్యంత సన్నిహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన వైకాపాలో చేరారు.
కానీ ఎన్నికలు అయ్యాక కొన్ని నెలలకే జగన్ ఆయన్ని దూరం పెట్టారు. తర్వాత జగన్ మీద ఘాటు విమర్శలు చేయడం మొదలుపెట్టారు డీఎల్. తాజాగా ఆయన మరోసారి జగన్ మీద, ప్రభుత్వం మీద ఎటాక్ చేశారు. వైఎస్ తనయుడు ఇంత అవినీతి చేస్తాడని తాను ఊహించలేదని.. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఏపీలో విపరీతంగా అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా గట్టి ఎదురు దెబ్బ తినడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రాన్ని బాగు చేయగల నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబే అని, పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని.. వచ్చే ఎన్నికల్లో వీళ్లిద్దరూ కలిసి పని చేస్తే కచ్చితంగా ఘనవిజయం సాధిస్తారని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. తాను ఇంకా వైకాపాలోనే ఉన్నానని, తనను ఎవరూ ఆ పార్టీ నుంచి తొలగించలేదని.. త్వరలోనే పేరున్న పార్టీ చూసుకుని చేరతానని డీఎల్ పేర్కొనడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates