అన్న‌కు.. ‘అమ్మ’ ఆశీర్వాదం క‌రువయ్యిందే!

జ‌గ‌న‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆ పార్టీ నేత‌లు చాలానే ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేయాల‌ని పిలుపునిచ్చింది. ఇక‌, ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మ‌న్‌, వైసీపీ ముఖ్య నాయ‌కులు, సీఎం జ‌గ‌న్‌కు సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు.. స్వ‌యంగా తాడేప‌ల్లి వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాల‌ను అందించి.. ఆశీర్వ‌దించారు.

ఇక‌, క్రైస్త‌వ బోధ‌కులు సైతం.. వ‌చ్చి సీఎం జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు కూడా మిన్న‌టాయని .. సీఎం జ‌గ‌న్‌పై అభిమానంతో పార్టీ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని.. వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక‌, నిత్యం జ‌గ‌న్‌ను విమ‌ర్శించే కాంగ్రెస్ నాయ‌కులు… తుల‌సిరెడ్డి, కామ్రెడ్స్‌.. రామకృష్ణ‌, నారాయ‌ణ వంటివారు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

క‌ట్ చేస్తే.. కీల‌క‌మైన జ‌గ‌న‌న్న కుటుంబ స‌భ్యులు మాత్రం ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఆయ‌న మాతృమూర్తి, వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ కానీ, జ‌గ‌న్ సోద‌రి.. ప్ర‌స్తుత వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. క‌నీసం.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా ష‌ర్మిల రియాక్ట్ కాలేదు. అదేవిధంగా విజ‌య‌మ్మ కూడా స్పందించ‌లేదు.

ఇక‌, గతంలో మాత్రం జ‌గ‌న్ బావ‌.. ప్ర‌బోధ‌కుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ మాత్రం.. ప్ర‌తి పుట్టిన రోజు వ‌చ్చి .. బావ‌మ‌రిదిని ఆశీర్వ‌దించి.. ప్రార్థన చేసి వెళ్లేవారు. అయితే.. గ‌త రెండేళ్లుగా మాత్రం ఆయ‌న క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ కుటుంబానికి(అటు జ‌గ‌న్‌-ఇటు ష‌ర్మిల-విజ‌య‌మ్మ‌లు) రాజ‌కీయాలే ప్ర‌ధాన‌మా? ర‌క్త సంబంధాలు క‌నుమ‌రుగేనా? అని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.