సాయిరెడ్డి సైలెంట్.. ఏం చేస్తున్నారో?!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీలో నెంబ‌ర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పోనీ..పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి క‌దా..అక్క‌డ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్క‌డున్నా.. సంచ‌ల‌నం సృష్టిస్తారాయే! సో, ఆయ‌న ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మ‌రి ఏం చేస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మ‌రో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయ‌న పిట్ట క‌బుర్ల రాత క‌నిపిస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటిది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో సాయిరెడ్డి ఎక్క‌డ ? అనే స‌హ‌జ సందేహం మీడియా వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఇండియాలోనే ఉన్నార‌ని.. అయితే.. గోప్యంగా ఆయ‌న మీడియా ఛానెల్ ప‌నుల‌పై తిరుగుతున్నార‌ని తెలుస్తోంది.

ఇదే విష‌యాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు కూడా చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మీడియా పెడ‌తా, పేప‌ర్‌పెడ‌తా అంటూ.. కొన్ని రోజుల కింద సాయిరెడ్డి ప్ర‌క‌ట‌నలు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆ ప‌నుల పైనే ఆయ‌న బెంగ‌ళూరులో ఉన్నార‌ని, బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి రెండు ప్రైవేటు ఛానెళ్లు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం.

ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఏపీలో రాజ‌కీయ‌ప‌ర‌మైన చానెల్‌ను ప్రారంభించేందుకు సాయిరెడ్డి లెక్క‌లు వేస్తున్నార‌నేది వైసీపీ లో ఆయ‌న వ‌ర్గంగా ప్ర‌చారం పొందిన కొంద‌రు చెబుతున్న మాట‌. మొత్తానికి త్వ‌ర‌లోనే సాయిరెడ్డి ఛానెల్ ప్రారంభం కానుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.