పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్లో 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఆరేళ్ల ముందు ట్విట్టర్లోకి అడుగు పెట్టగా.. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క సినిమా సంబంధిత ట్వీట్ కూడా వేయలేదు. ప్రధానంగా తన రాజకీయ ఉద్దేశాలు, విధానాలు చాటి చెప్పేందుకే ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆయనకు 40 లక్షలమంది ఫాలోవర్లున్నారు.
సగం మందిని తీసి పక్కన పెట్టేసినా.. మిగతా సగం మంది ఆయన్ని వ్యక్తిగతంగా ఇష్టపడటంతో పాటు రాజకీయ నేతగా ఎంతగానో అభిమానించే, ఆరాధించేవాళ్లే. ఐతే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పార్టీ సాధించింది 20 లక్షల ఓట్లే. సీట్లయితే కేవలం ఒక్కటే. చివరికి పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.
జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగకపోవడం పెద్ద సమస్య. అలాగే పవన్ అభిమానులు కూడా ఆయన రాజకీయ ఉద్దేశాల్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో.. తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని ప్రభావితం చేసి జనసేన వైపు ఆకర్షించడంలో, పవన్‌కు ఓటు వేయించడంలో విఫలమయ్యారన్నది స్పష్టం. సోషల్ మీడియాలో పవన్ అభిమానుల పవర్ చూస్తే.. పవన్ మీద ఇంత అభిమానం ఉందా అనిపిస్తుంది.
మొన్న పవన్ పుట్టిన రోజుకు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండ్ మీద ఒక్క రోజులో ఏకంగా 270 లక్షల దాకా ట్వీట్లు వేయగలిగారు ఫ్యాన్స్. ఇది సామాన్యమైన రికార్డు కాదు. ఒక్కో అభిమాని పని గట్టుకుని వేలల్లో ట్వీట్స్ వేయగలిగాడు. ఈ పట్టుదల, కసిని పార్టీ కోసం పని చేయడంలో చూపిస్తే పవన్ రాజకీయాల్లో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలడనడంలో సందేహం లేదు.
వేలల్లో ట్వీట్లు వేయగలుగుతున్న ప్రతి అభిమానీ కనీసం పది మందిని మోటివేట్ చేసి, జనసేనకు ఓటు వేసేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయం. ఆ దిశగా వారిని నడిపించడం పార్టీ అధినాయకత్వం దృష్టిసారించాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates