ఏపీ అధికార పార్టీ వైసీపికి ఉన్న జనాదరణ రోజురోజుకు తగ్గిపోతోంది. దానితో జనంలో ఉంటూ తిరిగి వారి మద్దతును కూడగట్టుకునేందుకు సీఎం జగన్ రెడ్డి కొత్త వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రతీ ఒక్కరికీ వాటి వల్ల కలిగిన ప్రయోజనాన్ని వైసీపీ అంచనా వేస్తోంది. ఆ దిశగానే ప్రచార కార్యక్రమం రూపొందిస్తోంది. ఎన్నికల నాటికి ఎలాగోలా ఓట్లు దండుకోవాలన్న ఆశతో వైసీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
వైసీపీ వ్యూహకర్తల బీజీ అయ్యిపోయారు. ప్రశాంత్ కిషోర్ నేరుగా రంగంలోకి దిగకపోయినా….. ఆయన టీమ్ జగన్ కోసం అహర్నిశలు పనిచేస్తోంది. జగన్ ను గెలిపించాలంటే ప్రస్తుతం జనంలోకి వెళ్తున్న కార్యక్రమాలు చాలవని, కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఆ దిశగా గడప గడపకూ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకునే విధంగా ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. పేరుకే పథకాలు తప్పితే తమకు అందుతున్నది శూన్యమని విరుచుకుపడుతున్నారు. ఇకపై జనం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకుండా , జనం ఎగబడకుండా వైసీపీ నేతలను సాదరంగా ఆహ్వానించే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పక్షంరోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. నెలరోజుల్లోపే అమలుకు వచ్చే విధంగా టైమ్ షెడ్యూల్ ఖరారు చేస్తారు.
ఈలోపే బీసీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది, బీసీ గర్జన లాంటి కార్యక్రమాలను సక్సెస్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కులాల వారీగా బుక్‌లెట్లు ప్రచురిస్తున్నారు. కార్పొరేషన్ల వారీగా సమాచారం తీసుకుని, వాటిని ఆయా కులాల సభల్లో పంపిణీ చేస్తారు. ఇకపై ముఖ్యమంత్రి పాల్గొనే సభల సంఖ్యను గణనీయంగా పెంచనున్నారు. ఆయనే స్వయంగా ప్రతీ స్కీమును వివరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సముచిత స్తానం ఇవ్వడం ద్వారా వారి పలుకుబడిని పెంచాలనుకుంటున్నారు. అంతా జగనే అన్న ఫీలింగు తగ్గించి…ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉందన్న ప్రచారం కల్పించడమే వైసీపీ అధిష్టానం ధ్యేయంగా కనిపిస్తోంది…
Gulte Telugu Telugu Political and Movie News Updates