ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక మార్పులు జరిగాయి. మార్పంటే మార్పే కాదు.. కీలక తలకాయలను సైతం పక్కన పెట్టేశారు. అత్యత ముఖ్యమైన ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి ఫైర్ బ్రాండ్ నేతలకు కూడా చుక్కలు చూపించారు. మరో ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు.
“మీరు చేయగలిగితే చేయండి.. లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా”… ఇదీ.. ఇటీవల గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ నేతలకు ఇచ్చిన అల్టిమేటం. మరి నేతలు దీనిని కామన్ అనుకున్నారేమో.. తెలియదు కానీ, అధినేత మాత్రం అనుకున్నది చేసి.. మార్చేశారు! ఇప్పుడు పార్టీలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేశారు.
ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై. బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని.. జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ఇక, కీలకమైన నియోజకవర్గం(చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) కుప్పం వైసీపీ బాధ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ను.. చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తీసేశారు.
ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. అయితే, ఏ కారణం చేతో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి మాత్రమే కొనసాగింపు దక్కింది.
మార్పులు ఇవీ..
- సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్ జిల్లా జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఇచ్చారు.
- మాజీ మంత్రి అనిల్ వద్దనున్న వైఎస్సార్, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు.
- బాలినేనికి ఇప్పటి వరకూ ఉన్న మూడు జిల్లాల్లో నెల్లూరును కొనసాగించారు.
- బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు ఇచ్చారు.
- కొడాలి నాని పర్యవేక్షించిన పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అప్పజెప్పారు.
- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మర్రి రాజశేఖర్‌కు… గుంటూరు జిల్లానూ ఇచ్చారు. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా ఎన్టీఆర్, కృష్ణా, గంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి బాధ్యతల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
- విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారు. వైవీ చూస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా బాధ్యతలను బొత్సకు కేటాయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates