ఇదేం ఖర్మ ఇది శ‌ర్మ‌ గారి ఐడియా!

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల హ్యహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ మొదటిసారి అధికారికంగా పార్టీ నేత‌ల‌ ముందుకువచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ కొత్తగా చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి వేదికపై నుంచి ఆయన పార్టీ నేతలకు వివరించారు. ఆంగ్లంలో కొద్దిసేవు మాట్లాడారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో ఎన్నిక‌ల‌కు వ్యూహకర్తను నియమించుకోవడం ఇదే ప్రథమం.

సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త అవసరం ఉందని గుర్తించిన టీడీపీ నాయకత్వం కొంతకాలం క్రితం రాబిన్ శ‌ర్మ‌ను నియమించుకుంది. రాబిన్ ను తీసుకున్న తర్వాత కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది. అయితే, ఆయన బృందం కాంగ్రెస్ కోసం పనిచేస్తుండటం, సునీల్ ఏపీపై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను వద్దనుకొంది. రాబిన్ శర్మకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత రాబిన్ బృందం ఇదేం ఖర్మ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. టీడీపీ కేడర్ సుమారు రెండు నెలలపాటు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి కలిసేలా దీనిని రూపొందించారు. పార్టీ నేతల సూచనతో ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అని పేరు మార్చారు.

ఎవ‌రీ రాబిన్‌.. ఏంటి క‌థ‌!

గుజరాత్‌కు చెందిన రాబిన్ గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేశారు. 2011 లోక్‌స‌భ‌ ఎన్నికల సమయంలో మోడీ విజయానికి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయానికి పనిచేసిన బృందంలో రాబిన్ శ‌ర్మ‌ ఉన్నారు. పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు.

రాబిన్ చెప్పిందేంటంటే..

ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్న తప్పుడు భావనను వ్యాపింపచేయడానికి అధికార పార్టీ ఒక ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. పథకాల అమలుతో అంతా బాగుందన్న భ్రమను కలిగిస్తోంది. ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారి జీవనం ఎంత దుర్భరంగా మారిందన్నది ప్రధాన ప్రతిపక్షంగా మనం చూపించాలి. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి. వారి మనోగతం తెలుసుకోవాలి అని రాబిన్ శ‌ర్మ‌ పార్టీ నేతలకు సూచించారు. కాగా గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకొంది. ఐ ప్యాక్ సంస్థ ఇప్పుడూ ఆ పార్టీ కోసం పనిచేస్తోంది.