బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు

Buggana Rajender Reddy
Buggana Rajender Reddy

అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని వేధిస్తారా? అంటూ సూటిగా అడిగేసి.. కడిగేశారు.

నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించటానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న వ్యాపార ప్రతినిధులు.. ప్రభుత్వం తమను చూసే తీరులోనే తేడా ఉందన్న ఆవేదననను వ్యక్తం చేశారు. ఒక వస్తువు ధర రూ.70 ఉంటే.. రూ.వందకు అమ్ముతున్నామని.. దాని విలువ రూ.150 ఉంటుందని.. పన్నులు ఎగ్గొట్టటానికి విలువ తగ్గించి చూపుతున్నామంటూ అధికారులు తమకు ఫైన్లు వేస్తున్నారన్నారు. ఎంతమంది అదికారులకు వస్తువులను బట్టి ధరల్ని తేల్చగలరు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

మార్బుల్ వ్యాపారాన్నే తీసుకుంటే.. రాయి నాణ్యతకు అనుగుణంగా ధర ఉంటుందని.. పన్నులు వేసే అధికారుల్లో ఎంతమందికి రాయి నాణ్యత గురించి తెలుసు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విధిస్తున్న టార్గెట్ల కారణంగా అధికారులు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వ్యాపార సంస్థలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు. తనిఖీల పేరుతో వాహనాల్ని ఆపేయటం.. జరిమానాలు వేయటం లాంటివి చేస్తున్నారన్నారు.

ఇలా పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు గళం విప్పుతూ.. తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను విప్పటంతో ఆర్థిక మంత్రి బుగ్గన ఇబ్బందికి గురయ్యారు. తాము అధికారులకు టార్గెట్లు పెట్టటం లేదన్నారు. అదే సమయంలో.. వ్యాపారులు పేర్కొన్న విదంగా ఆకస్మిక దాడులు.. తనిఖీలను తగ్గిస్తామని మంత్రి బుగ్గన పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్న తీరు మంత్రికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇలా వ్యాపారులు ఒక సమావేశంలో సంబంధిత మంత్రి ముందు ఓపెన్ కావటం చాలా అరుదన్న మాట వినిపిస్తోంది.