ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో కదలికలు ప్రారంభమయ్యాయా? నాయకులు ముందుకు కదులుతున్నారా? ప్రజల్లోకి వస్తున్నారా? అంటే.. తాజాగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనసేన నేతల కదలికలు బాగానే ఉన్నా యని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి పార్టీ పెట్టి 8 సంవత్సరాలు పూర్తయినా.. ఇప్పటి వరకు ఆశించిన రీతిలో ప్రజాఉద్యమం మాత్రం నిర్మించలేక పోయారు. ప్రజల్లొకి కూడా వెళ్లలేక పోయారు. ఇది పార్టీకి మైనస్ అయింది.
కేవలం పవన్ ఇమేజ్ మాత్రమే పార్టీని ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చింది. ఇది ఎంత వరకు పార్టీని నడిపిస్తుంది? అనేది ప్రశ్నగానే మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ ఇటీవల పార్టీ నాయకులకు బాగానే క్లాస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పనిచేసేవారిని గుర్తు పెట్టుకుంటానని, ఆయన స్పష్టం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. పనిచేయని వారు మొహమాటం లేకుండా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని కూడా చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం.. సహా అన్ని జిల్లాల్లోనూ జనసేన నేతలు రోడ్డెక్కుతున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నానాజీ, లీలాకృష్ణ తదితర నేతలు రోడ్డెక్కారు. విజయవాడలో పోతిన వెంకట మహేష్, సోడిశెట్టి రాధా వంటివారు కూడా రోడ్డెక్కుతున్నారు. ప్రజల సమస్యలపై బాగానేరియాక్ట్ అవుతున్నారు. నానాజీ , లీలా కృష్ణ అయితే.. ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై తీవ్ర ఆరోపణలే చేశారు. ఆయన భూమిని ఆక్రమించుకున్నారని.. విమర్శించడంతోపాటు కలెక్టర్ కు కూడా ఫిర్యాదులు చేశారు. మరోవైపు.. అనంతపురంలో నూ జనసేన నాయకులు రోడ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రహదారులు వేయాలంటూ.. నినదించారు.
ఇక, జగనన్న ఇళ్ల కాలనీల్లోనూ జనసేన నాయకులు విస్తృతంగా పర్యటించారు. అక్కడి లోపాలను ఎత్తి చూపారు. ప్రజలకు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధీ ఒనగూరలేదని.. ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతోపాటు.. జగనన్న ఇళ్లకు సంబంధించి.. లోటుపాట్లను కూడా ఎత్తి చూపించారు. మొత్తంగా ఈ పరిణామాలతో జనసేనలో అయితే.. కదలికలు కనిపిస్తున్నాయని.. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇక తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates