జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గురించి రెండుముక్కల్లో చెప్పాలంటే.. మనసులో ఏది అనుకుంటే అది దాచుకునే తత్వం ఆయనకు లేదు! అంతే!! ఇదే ఆయనకు ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంటే.. ఎక్కువ సార్లు మైనస్ అయిపోతోంది. నిజానికి రాజకీయ నాయకుడు అంటే ఎక్కడికయ్యెడి ప్రస్తుత.. మప్పటికామాటలాడి.. అని భర్తృహరి అన్నట్టు వ్యవహరించాలి.
ఇప్పటి వరకు ఉన్నపార్టీలు ఇలానే ఉన్నాయి. కానీ, ఎటొచ్చీ.. పవన్ మాత్రం తన మనసులో మాటను భావావేశాన్ని ఏమాత్రం అణుచుకునే పరిస్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. విశాఖకు వచ్చిన మోడీతో భేటీ అయ్యారు. అక్కడ ఏం చర్చించారో.. ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ, బయటకుమాత్రం కొన్ని లీకులు వచ్చాయి.
ఇక, దీనిపై ఒకవైపు రాజకీయంగా చర్చ చల్లారకుండానే పవన్.. ప్రధానిని మోసేస్తున్నారు. ఆయనపై కవితలు అల్లేస్తూ.. పొగడ్తల పొన్నలతో మోడీపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. సాహో నారాజా! నాకన్నా.. నిను పొగుడు వారెవరూ!! అన్న చందంగా మోడీ పై భజన ప్రారంభించేశారు పవన్.
తన అధికారిక ట్విట్టర్‌లో ఆయా పొగడ్తలను పవన్ పోస్ట్ చేశారు. వీటిలో ప్రముఖ కవి.. గుంటూరు శేషేంద్ర శర్మ కవితలను ఉటంకించారు. “ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- అంటూ శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధాని మోడీ ప్రస్థానానికి అద్దం పడతాయని పవన్ స్పష్టం చేశారు.
అంతేకాదు..
దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో దేశ ప్రధానమంత్రిగా మోడీ పగ్గాలను స్వీకరిం చారని గుర్తు చేశారు. ప్రాంతీయ వాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొన్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ సమానంగా ఆదరించి దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరిలోనూ తాము భారతీయులం అనే భావన నింపారని పవన్ వ్యాఖ్యానించారు.
మరొకటి..
కరోనా రూపంలో ప్రజారోగ్యానికి విపత్తు వాటిల్లినప్పుడు, దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు వాటి నుంచి దేశాన్ని, దేశ ప్రజలను బయట పడవేయడానికి ప్రధాని మోడీ అహరహం తపించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఆయన ఎదుర్కొన్నారని కితాబిచ్చారు. అలాంటి స్వభావం, నాయకత్వ పటిమ గల పురోగమనశీలిగా మోడీని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. మొత్తానికి ఇది.. మొదలే అన్నట్టుగా అనిపించినా మొదట్లోనే ఇంత ఘాటైన భజన చేస్తే మున్ముందు ఇంకెలా ఉంటుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates