ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నారా, నందమూరి కుటుంబాలు నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాయి. ఈ నెల 21వ తేదీకి నారా దేవాన్ష్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది.
“తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ.. మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది” అని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్ ను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.
ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సహా పలువురు పాల్గొన్నారు. 2015 మార్చి 21న దేవాన్ష్ జన్మించాడు. ప్రస్తుతం విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న ఆయన ప్రపంచ చెస్ లో పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ వేడుకలతో పాటు శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ వేడుకలు కూడా జరగడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates




