‘గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అసలు ఎందుకింత రాజకీయం రచ్చగా మారింది? తక్షణం నివేదిక ఇవ్వండి!’ ఇదీ.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితకు పార్టీ అధిష్టానం తాజాగా ఆదేశాలు చేసిందని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో సీఎం జగన్‌కు అత్యంత ముఖ్యుడు, సన్నిహితుడు ఆళ్ల రామకృష్నారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవల ఇప్పటంలో పవన్ కళ్యాణ్.. పర్యటించడం.. అక్కడ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, అనంతరం సవాళ్లు రువ్వడం వంటివి అధిష్టానానికి బాగానే తాకాయి. అయితే, వాటికి కౌంటర్లు ఇవ్వడంలోనూ, పవన్‌పై ఎదురు దాడి చేయడంలోనూ ఎమ్మెల్యే ఆళ్ల వెనుకబడ్డారనే అసంతృప్తి కూడా అధిష్టానంలో కనిపించింది. ఇది ఒక పక్క ఇబ్బందిగా ఉండగానే మరోవైపు.. తాజాగా ఇంకో ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ పర్యటించి సుమారు 50 మంది వరకు రెడ్డి నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో ఆళ్లకు అత్యంత సన్నిహితుడు అయిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వెళ్లి టీడీపీ కండువా కప్పుకోవడం, ఈ సందర్భంగా వైసీపీ రెడ్లందరూ వచ్చేయండి పార్టీలో చేర్చుకుంటాం అని లోకేష్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. ఇంత జరిగినా ఎమ్మెల్యే ఆళ్ల మాత్రం ఎక్కడా రియాక్ట్ కాలేదు.
దీంతో హుటాహుటిన ఇక్కడ పర్యటించి అసలు ఏం జరుగుతోందో చెప్పాలని, నివేదిక రూపంలో ఇవ్వాల ని పార్టీ అధిష్టానం ఇంచార్జ్ సుచరితను ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సుచరిత రేపు లేదా ఎల్లుండి వచ్చి ఇక్కడ పర్యటించి పార్టీ నేతల నుంచి సమాచారం సేకరించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మంగళగిరిలో వారం వ్యవధిలో చోటుచేసుకున్ని ఇప్పటం గ్రామ వ్యవహారం, పార్టీలో జంపింగులపై అధిష్టానం వెంటనే రియాక్ట్ అవడం ఆసక్తిగా మారింది.