వైసీపీ తాట‌తీస్తాం.. ఒక్క అవ‌కాశం: ప‌వ‌న్

వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదని తప్పుబట్టారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని, జనసేన రావాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతిపరుల తాటతీస్తామని పవన్‌ ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జనసేన పిలుపునిచ్చింది. జగనన్న ఇళ్లు-పేదల కన్నీళ్లు-జగనన్న మోసం.. పేరుతో నిరసనలు చేపట్టాలని పవన్ కోరారు. జగనన్న ఇళ్ల పేరుతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. జగనన్న ఇళ్లనే నిర్మించలేనివారు.. రాజధాని నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల దోపిడీపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తామని పవన్‌తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్‌ విజయనగరం చేరుకున్నారు. విజయనగరం వై-జంక్షన్‌లో పవన్‌కు జన సైనికులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

రాజధాని పేరిట ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారని  పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న కాలనీలపై జనసేన పార్టీ చేపట్టిన సోషల్‌ ఆడిట్‌లో పవన్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ నాయకులు చేసే మోసాన్ని గ్రహించాలని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు చేసిన కుంభకోణంపై తానే స్వయంగా ప్రధాని మోడీకి నివేదిక అందజేస్తానని.. పవన్‌కల్యాణ్‌ చెప్పారు.

పేదలకు ఇళ్లు పేరుతో వైసీపీ నేతలు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్రను ముఖ్యంగా యువతను మోసం చేస్తున్న వైసీపీని.. ఇక్కడి యువతే నిలదీయాలని సూచించారు. ఏదో అద్భుతం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నట్టేట ముంచిన వైసీపీని ఇక సాగనంపాలన్న పవన్‌.. యువత కోసం తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకముంచితే గుండాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఢిల్లీకి వెళ్లి చిన్నపిల్లల్లాగా నాపై చాడీలు చెప్తున్నారని వైసీపీ ప్రభుత్వాంపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఇకపై కేసులు పెట్టినా.. చంపేస్తా అని చెప్పినా.. వెనక్కి తగ్గనంటూ వెల్లడించారు. ఉత్తరాంధ్ర నాయకుల సంగతి ఇక్కడి ప్రజలు చూసుకుం టారని తెలిపారు. తమకు ఓట్లు వస్తాయో లేదో తెలియదు.. అయినా నాయకులను నిలబెడతామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు ఎంతసేపు భూతులు తిట్టడం తప్ప.. మరో పని లేదు ఎద్దేవా చేశారు. తాము పదవుల కోసం పోరాడటం లేదని పవన్ పేర్కొన్నారు. మీ కాలనీకి వైసీపీ నేతలు వస్తే.. ఎప్పుడు ఇళ్లు నిర్మిస్తారో గట్టిగా ప్రశ్నంచాలని పవన్ సూచించారు.