లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్

కొద్ది నెలల క్రితం వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆప్ మంత్రి మనీష్ సిసోడియా చుట్టూ అల్లుకున్న ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన బంధువుల పేర్లు కూడా వినిపించాయి. విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి పేరు కూడా ఈ స్కాంలో బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన వ్యాపారి వినయ్ బాబును తాజాగా ఈడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపింది.

ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. వీరిద్దరూ కలిసి భారీ మొత్తంలో బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అరబిందో గ్రూప్ నుంచి దాదాపు 2000 కోట్ల రూపాయల మొత్తాన్ని వీరు వైట్ మనీగా మార్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా వీరిద్దరిని ఢిల్లీలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. తాజాగా నేడు విచారణ ముగియడంతో ఈ ఇద్దరినీ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ కోట్లాది రూపాయల విలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని, ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లుగా శరత్ పై అభియగాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ లిక్కర్ స్కామ్ లో సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి పేరు కూడా వినిపించడం గతంలో కలకలం రేపింది. ఈ క్రమంలో తాజా అరెస్టుల నేపథ్యంలో మరికొంతమంది ఏపీకి చెందిన బడా రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు రావచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు సన్నిహితుడిగా పేరుపొందిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్ళైను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ స్కాం నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పిఏ ను కూడా ఈడీ అరెస్టు చేసి విచారణ జరుపుతోంది.