ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ అరెస్టు చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. ఆయనకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన్ను.. ఆయన కుమారుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకూ ఇంతటి హైడ్రామా ఎందుకు? అయ్యన్నపాత్రుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన మీద ఉన్న అభియోగం ఏమిటి? ఆయనపైనా.. ఆయన కొడుకు పైనా సీఐడీ అధికారులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకూ ఆయన చేసిన అరవీర భయంకర నేరం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే విస్మయానికి గురి కాక మానదు.
అధికారులు వెల్లడిస్తున్న సమచారాన్ని చూస్తే.. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రెండు సెంట్ల స్థలాన్ని (96 గజాలు)అక్రమంగా ఆక్రమించిన అయ్యన్న పాత్రుడు ఆక్రమించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలుపై రెండు సెంట్ల మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మించారు.
దీన్ని ఈ మధ్యన అధికారులు గుర్తించి కూల్చేశారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించిన సమయంలో అధికారులకు అయ్యన్న.. ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. దీంతో.. ఈ పత్రాలపై ఇరిగేషన్ అధికారులు సీఐడీకి కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అయ్యన్న.. ఆయన కుమారుడు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ చేసినట్లుగా నిర్దారించారు. ఇందులో భాగంగా ఈ తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేశారు. వారిద్దరిని ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
నిజంగానే అయ్యన్న పాత్రుడు ఆయన కుటుంబ సభ్యులు రెండు సెంట్ల స్థలంలో అక్రమంగా ఆక్రమించుకున్నారే అనుకుందాం.. అలాంటి నేరానికి ఇంత హైడ్రామాతో.. తెల్లవారుజామున భారీగా ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి.. అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కొందరు తమదైన రీతిలో సమాధానాన్ని ఇస్తున్నారు.