ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? తమిళసినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్‌లా ఉన్నాడు కదూ! కానీ, కాదు. మనోడో.. మన పాలే! మునుగోడు ఉప ఎన్నికలో తనదైన శైలిలోదూసుకుపోతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, శాంతి దూతగా చెప్పుకొనే కేఏ పాలే తాజాగా ఈ వేషం కట్టారు. పక్కా రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు.
చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు పాల్. తలకు కండువా కట్టుకుని పొలాలకు వెళ్లి అన్నదాతలతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు… అనంతరం సైకిల్ తొక్కుతూ ఓటర్లను కలిశారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ , బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి జరగబోదని, ఓట్ల కోసం డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇటీవలకాలంలో పాల్ తనదైన శైలిలో ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉండడం, వారితో కలిసి మాట్లాడడం, టీ తాగడం, సెలూన్ కు వెళ్లినా.. క్షణం వేస్ట్ చేయకుండా.. అక్కడకు కూడా మీడియాను పిలుచుకుని ప్రచారం చేయడం తెలిసిందే. ఇక, కొన్ని కొన్ని మండలాల్లో అయితే.. ఆయన డ్యాన్స్ వేసి మరీ యువతను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పాల్ వేస్తున్న ‘వేషాలు’ ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. అన్నట్టు ప్రధాన పార్టీలను మించిపోయిన రీతిలో పాల్ ప్రచారం చేస్తుండడం విశేషం. ఒక్కొక్కసారి.. ఇలాంటి వారు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి పాల్ రొట్టె విరిగి నేతిలో పడుతుందో.. పొయ్యిలో పడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates