ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో రెండో ఆడియో లీక్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర తుఫానుగా మారిన ఫామ్‌హౌజ్ ముడుపులు, కొనుగోళ్ల వ్య‌వ‌హారంలో.. మ‌రో ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి వ‌చ్చిన తొలి ఆడియోలో.. స్పాట్‌పై చ‌ర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే నేత‌ల‌కు అభ‌యం కూడా ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎక్క‌డ ఎప్పుడు ఎలా క‌ల‌వాలి.. ఏం చ‌ర్చించుకోవాల‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా విడులైన రెండో ఆడియో మ‌రింతగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాల‌నే విష‌యంపై ఈ ఆడియోలో చ‌ర్చించుకున్నారు.

“నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఆశిస్తున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌ రెడ్డి ప్రధాన వ్యక్తి. రోహిత్‌ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగిలినవారికి నామమాత్రం ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామన్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ముందుగానైతే రూ. 100 కోట్లకు రావడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడి స్పష్టత ఇవ్వండి. నేను బి.ఎల్. సంతోష్‌కు మెస్సేజ్ చేస్తా. నలుగురు రావడానికి రెడీగా ఉన్నారని తుషార్‌తో చెప్పాను” ఇలా స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, సింహయాజులు, నందకుమార్ ముగ్గురి మధ్య సంభాషణలు జరిగాయి. ఈ ఆడియో మొత్తం 27 నిమిషాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన ప్ర‌య‌త్నం.. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ముందుగానే స‌మాచారం అందుకున్న‌ సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు.

హైకోర్టు ఆదేశం ఇదే..

‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో సైబరాబాద్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. “నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు. ముగ్గురు నిందితులు ఇవాళ సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు సమర్పించాలి. ఈకేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దు’’ అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.